చిన్నకోరుకొండి గ్రామ టీడీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పార్టీ పార్లమెంట్-అసెంబ్లీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య ఆదివారం ఈ గ్రామానికి వచ్చారు.
చిన్నకోరుకొండి (కల్లూరు), న్యూస్‌లైన్: చిన్నకోరుకొండి గ్రామ టీడీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పార్టీ పార్లమెంట్-అసెంబ్లీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య ఆదివారం ఈ గ్రామానికి వచ్చారు. వీరిని పార్టీ స్థానిక నాయకులు సహకరించకపోగా.. అడ్డుకున్నారు. ఈ పరిణామంతో వారిద్దరూ (నామా, సండ్ర) ప్రచారం పూర్తిచేయకుండానే వెనుదిరిగారు.
ఈ గ్రామ టీడీపీ నాయకులు యాసా రామకృష్ణ (సర్పంచ్)... నామా వర్గంలో, చావా వెంకటేశ్వరరావు (సొసైటీ అధ్యక్షుడు).. తుమ్మల వర్గంలో ఉన్నారు.
సొసైటీ, పంచాయతీ ఎన్నికల నాటి నుంచి ఈ ఇద్దరి మధ్య వర్గ పోరు సాగుతోంది. నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య కలిసి ఎన్నికల ప్రచారం కోసమని ఆదివారం ఇక్కడకు వచ్చారు. వీరి ప్రచార రథం గ్రామంలోకి రాగానే.. దాని పైకి యాసా రామకృష్ణ ఎక్కారు. ఇది చూసిన చావా వెంకటేశ్వరరావు అనుచరులు భగ్గుమన్నారు. ఆయన రథం ఎక్కడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో- యాసా రామకృష్ణ, చావా వెంకటేశ్వరరావు అనుచరుల మధ్య వాగ్వాదం, ఘర్షణ నెలకొంది. ఈ పరిస్థితిలో, తమ ప్రచారం సవ్యంగా సాగదని భావించిన నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య.. గ్రామంలో ప్రచారం చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆ తరువాత, సండ్ర వెంకటవీరయ్య ఒక్కరే పక్కనున్న తెలగవరం గ్రామంలో ప్రచారానికి వెళ్ళారు.