పవన్ కళ్యాణ్
హైదరాబాద్: అవినీతితో కుళ్లికంపుకొడుతున్న వ్యవస్థ బాగుపడాలన్న ఉద్దేశంతో తాను రాజకీయాలలోకి వచ్చినట్లు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రశ్నించడం కోసం, ప్రశ్నించడం నేర్పడం కోసం రాజకీయాలలోకి వస్తున్నట్లు తెలిపారు. జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తారని కూడా చెప్పారు. తాను చూసిన ఘటనల నుంచి ఈ ఆవేశం వచ్చిందని చెప్పారు. కానీ ఈరోజు విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ ఎన్నికల్లో నేతలు ఇచ్చే డబ్బు తీసుకోవాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నాయకుల నుంచి డబ్బు తీసుకుని ఓటు మాత్రం టీడీపీ-బీజేపీ అభ్యర్థులకు వేయాలని సూచించారు.
జనసేన దోపిడీని ప్రశ్నిస్తుందన్నారు. అందరినీ ప్రశ్నిస్తుందని చెప్పారు. అవినీతి వ్యవస్థను మార్చడం అంటే ఇదేనా? ప్రశ్నించడం అంటే ఇదేనా? డబ్బు తీసుకోమని ఓటర్లకు చెప్పడం అవినీతి కాదా? ఇది అవినీతిని రూపుమాపడం ఎలా అవుతుంది? నీ ఇజం ఇదేనా? జనానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారు? అని ఆయన అభిమానులతోపాటు పలువురు ప్రశ్నిస్తున్నారు. స్టేజీ ఎక్కిన పవన్కు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్ధం కావడంలేదన్నారు. కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ఓ సినిమా హీరోలా ఆయన మాట్లాడటంలేదని చెబుతున్నారు.
పవన్ ఏం కోరుకుంటున్నారు? ఏం కావాలని అనుకుంటున్నారు? రాష్ట్రానికి ఏం చేయాలని అనుకుంటున్నారు? బిజెపి, టిడిపి గెలిస్తే రాష్ట్రానికి ఏం చేస్తారు? ఏం సాధించాలని అనుకుంటున్నారు?.... ఇటువంటి విషయాలు చెప్పకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని మాత్రమే విమర్శించడం ధ్యేయంగా పెట్టుకొని మాట్లాడటం జనానికి నచ్చడంలేదు. రాష్ట్రం కోసమో, ప్రజల కోసమో కాకుండా కేవలం జగన్ను విమర్శించడం కోసమే అతను రాజకీయ పార్టీ పెట్టినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఒక స్పష్టతతో పోరాడిన ఏకైక నాయకుడు జగన్. జైలులో ఉండి కూడా దీక్ష చేశారు. ఆ తరువాత దేశమంతటా తిరిగి జాతీయ నేతలను కలిసి సమైక్య రాష్ట్ర లక్ష్యానికి మద్దతు కూడగట్టారు. అటువంటి జగన్ను రాష్ట్ర విభజనకు కారణం అని చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారు. అదీ రాష్ట్ర విభజనకు బహిరంగంగా మద్దతుపలికిన రెండు పార్టీల నేతలను పక్కనబెట్టుకొని పవన్ అలా మాట్లాడటం మరీ విడ్డూరంగా ఉందని, అతని రాజకీయ జ్ఞానం ఏమిటో అర్ధమవుతుందని అంటున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన కాంగ్రెస్ పార్టీని ఏమీ అనకుండా, అధికారంలో లేని సమైక్యత కోసం చివరి వరకు పోరాడిన జగన్ను విమర్శించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్లో ఉన్న కేంద్ర మంత్రి చిరంజీవిని పల్లెత్తు మాట అనకుండా, ఇంకా తనకు అన్న అంటే గౌరవం అని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో జనానికి తెలియడంలేదు. ఏ అంశం పట్ల కూడా ఒక స్పష్టత లేకుండా తిక్కతిక్కగా మాట్లాడుతున్న ఇటువంటి వ్యక్తినా తాము ఇప్పటి వరకు అభిమానించింది? అని కూడా కొందరు తమలో తమని ప్రశ్నించుకుంటున్నారు.