పవన్ అభిమానులు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి రాజా ఫొటో
పవన్ కల్యాణ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించిన హీరో రాజాపై పవన్ అభిమానులు తీవ్ర దుష్ప్రచారం చేశారు. కొత్తగా పెళ్లయిన రాజా.. రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలలో విపరీతంగా దుష్ప్రచారం చేశారు. రాజా ఆత్మకు శాంతి కలగాలంటూ అతడి ఫొటోను పోస్ట్ చేసి కామెంట్లు చేశారు. అయితే.. ఇదంతా అబద్ధపు ప్రచారం. వాస్తవానికి రాజాకు ఎలాంటి ప్రమాదం జరగనేలేదు. ఆయన క్షేమంగా ఉన్నారు. కేవలం పవన్ కల్యాణ్ను ప్రశ్నించిన పాపానికే ఆయన మీద పవన్ ఫ్యాన్స్ ఇలాంటి దుష్ప్రచారానికి దిగారు. ఇది ఎంతవరకు సబబని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రశ్నించడానికే తన జనసేన పార్టీ ఉందని చెప్పుకొన్న పవన్, ఆయన అభిమానులు.. పవన్ను ఎవరైనా ప్రశ్నిస్తే సహించరా? ఏకంగా వారి చావు కోరుకుంటారా? బతికున్న వారినే చంపేస్తారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. పవన్ అభిమానుల వైఖరిని తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారు.
ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదన్న పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ఒకప్పుడు తాను విమర్శించిన చంద్రబాబునే గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. పనిలోపనిగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన విషం కక్కుతున్నారు. సినీ నటుడు రాజా ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏం పోరాటం చేశారంటూ పవన్ను నిలదీశారు. రాజా ఏం అన్నారంటే..
పవన్ కల్యాణ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని శనివారం సినీ హీరో రాజా ఆరోపించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టుల మీద ఆధారపడి మాట్లాడటం కాదని....చేతనైతే ప్రజల మధ్య తిరిగి వారి సమస్యలను తెలుసుకుని మాట్లాడాలని పవన్ కల్యాణ్కు సూచించారు. సినిమా ఇండస్ట్రీలో అన్యాయం గురించి ఎప్పుడైనా స్పందించారా అంటూ సూటిగా ప్రశ్నించారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ను ఎదిరించిన ఒకే ఒక్క సింహం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆయన అభివర్ణించారు. టీడీపీ, బీజేపీలకు జగన్ ఫోబియా పట్టుకుందని అన్నారు. అంతే పవన్ ఫ్యాన్స్ ఆవేశంతో రెచ్చిపోయి ఇలా తప్పుడు ప్రచారానికి దిగారు.