బంధువు బంధువే... రాజకీయం రాజకీయమే
తమ్ముడు తమ్ముడే... పేకాట పేకాటే.... పేకాటకు వర్తించే ఈ సామెత రాజకీయాలకీ బాగా వర్తిస్తుంది. రంగారెడ్డి, హైదరాబాద్ లలో పోటీలో ఉన్న చాలా మంది బంధువులే. అయినా ఎవరి జెండా వారిది. ఎవరి ఎజెండా వారిది. రంగారెడ్డి జిల్లాలో ఈ రసవత్తర రాజకీయంపై ఓ లుక్కేద్దాం:
అన్నాదమ్ముళ్లు: చేవెళ్ల లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీచేస్తున్నారు. మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కొండా రాఘవరెడ్డిబరిలో దిగారు. వీరిద్దరిదీ అన్నదమ్ముళ్ల వరుస. ఈ నియోజకవర్గంలో అన్నా, తమ్ముళ్ల పోటీ స్థానికంగా రంజుగా మారింది.
బావ, మరుదులు: సనత్‌నగర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న మర్రి శశిధర్‌రెడ్డి, అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దగ్గరి బంధువులు. వరసకు బావ, బావమరుదులు అవుతారు. మాజీ హోంమంత్రి టి.దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ చేవెళ్ల లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. హైదరాబాద్ జిల్లా గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖేష్ గౌడ్ పోరులో నిలిచారు. వీళ్లదీ బావ, బావమరిది వరుసే. తాండూరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్నం మహేందర్‌రెడ్డి పోటీచేస్తున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిరువురు వరసకు బావ, బావమరిది. ఒకరు టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తుండగా.. మరొకరు కాంగ్రెస్ నుంచి పోరులోకి దిగారు.
మామా అల్లుళ్లు: ఇబ్రహీంపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగంలోకి దిగగా అంబర్ పేట అసెంబ్లీ సెగ్మెంటు నుంచి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరిదీ మామ అల్లుడు వరస.
వియ్యంకులు: మహేశ్వరం అసెంబ్లీ నుంచి మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన సోదరుడు మల్‌రెడ్డి రాంరెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ రెబల్‌గా బరిలో దిగారు. మహేశ్వరం నుంచే పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి, మల్కాజిగిరి టీడీపీ ఎంపీ అభ్యర్థి మల్లారెడ్డి వియ్యంకులు. ఒకరు అసెంబ్లీకి, మరోకరు లోక్‌సభకు పోటీచేస్తున్నారు.