
సిట్టింగ్.. షిఫ్టింగ్ !
జిల్లాలోని సిట్టింగ్ ఎంపీలకు స్థానచలనం
కేంద్ర మంత్రులిరువురూ మహబూబ్‌నగర్‌కు
అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కసరత్తు
తాజా పరిణామాలతో ఆశావహుల్లో కొత్త ఆశలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. లోక్‌సభ సీట్ల అభ్యర్థుల వ్యవహారం ఆ పార్టీలో సరికొత్త మలుపులకు దారితీస్తోంది. చేవెళ్ల, మల్కాజ్‌గిరి పార్లమెంట రీ స్థానాలకు ప్రాతినిధ్యం విహ స్తున్న కేంద్ర మంత్రులు సూదిని జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ ఇరువురికీ ఈసారి స్థానమార్పిడి తప్పదనే ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ జైపాల్‌రెడ్డి ఈ ఎన్నికల్లో సొంత జిల్లా (మహబూబ్‌నగర్) నుంచి పోటీ చేస్తానని సంకేతాలివ్వడంతో అధిష్టానం.. కొత్త అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో 2009 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి జనరల్ సీటు నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించిన సర్వేను కూడా ఈ సారి నాగర్‌కర్నూలు నుంచి పోటీ చేయమని అధిష్టానం ఒత్తిడి చేస్తోంది.
ఈ పరిణామాలను పరిశీలిస్తే సిట్టింగ్ ఎంపీలు.. అందులోనూ కేంద్ర మంతుల్రిరువురూ కాకతాళీయంగా మహబూబ్‌నగర్ జిల్లాకు షిఫ్ట్ కావడం అనివార్యంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ టికెట్ అనూహ్యంగా దక్కించుకున్న జైపాల్‌రెడ్డి 18,362 సమీప ప్రత్యర్థి ఏపీ జితేందర్‌రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత యూపీఏ-2 సర్కారులో కొలువుదీరారు. అయితే, గత ఎన్నికల వేళ కేవలం ఒకసారి మాత్రమే ఇక్కడి నుంచి బరిలో దిగుతానని, వచ్చే ఎన్నికలో పోటీచేయనని అప్పట్లో జైపాల్ సెలవిచ్చారు. ఈ క్రమంలోనే ఈ సీటుపై పలువురు ఆశావహులు గంపెడాశలు పెట్టుకున్నారు.
జైపాల్‌రెడ్డి సైతం చెప్పినట్లుగానే ఈసారి పాలమూరుకు మారేందుకు సన్నాహాలు చేసుకుంటుండడంతో టికెట్ రేసులో ఉన్న నేతలు తాజాగా దూకుడును మరింత పెంచారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి, రాగం సుజాతయాదవ్, మర్రి శశిధర్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా ఇక్కడి నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సర్వేను నాగర్‌కర్నూలుకు మార్చాలని ఏఐసీసీ భావిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలతో పొసగకపోవడం, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు అంతరంగిక సర్వేల్లో తేలడంతో సర్వే స్థానే కొత్తవారిని రంగంలోకి దించాలని యోచిస్తోంది.
ఈ క్రమంలో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన నాగర్‌కర్నూలుకు షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని చేవెళ్ల, మల్కాజ్‌గిరి ఎంపీలిద్దరు వేరే నియోజకవర్గాలకు మారడం తథ్యంగా కనిపిస్తోంది. ఇదిలావుండగా, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అభ్యర్థిత్వంపైనా అనుమానాలు తలెత్తుతుండడం గమనార్హం.
ఈ స్థానాన్ని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్నట్లు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి స్పష్టం చేయడం, తాను కాకపోతే కోడలు వైశాలి పేరును పరిశీలించాలని సిఫార్సు చేయడం చూస్తే కోమటిరెడ్డికి చెక్ పెడుతున్నట్లు అర్థమవుతోంది. ఇదే జరిగితే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు స్థానంలో కొత్త అభ్యర్థులు తెరమీదకు వచ్చే అవకాశముంది.