బాబు చెయ్యి పట్టుకుంటే మసే
చంద్రబాబు ఎవరి చెయ్యి పట్టుకుంటే వాళ్లు మసేనన్న విషయం మరోసారి రుజువవుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లే పెట్టుకుని, వాళ్లకు ఎలాంటి స్థానాలు కేటాయించారో చూస్తే మొత్తం విషయం తెలిసిపోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా కేడర్ బలమే లేని రాజమండ్రి, రాజోలు నియోజకవర్గాలను బీజేపీకి చంద్రన్న చాలా ఉదారంగా కేటాయించేశారు. దీంతో అసలు అక్కడెలా పోటీ చేయాలో తెలియక కమలనాథులు తల పట్టుకున్నారు.
ఇక తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నట్లు ప్రకటించిన లోక్ సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ ఇప్పుడు ఎందుకొచ్చిందిరా నాయనా అని తల కొట్టుకుంటున్నారు. మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించిన జేపీ.. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా మల్లారెడ్డిని ప్రకటించడంతో కంగుతిన్నారు. ఎలాగోలా చంద్రబాబును ఒప్పించి, మల్లారెడ్డిని బరినుంచి తప్పించాలని బీజేపీ అగ్రనాయకులను జేపీ బతిమాలినట్లు సమాచారం.
బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, పొత్తుల విషయం చూసిన సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ ఈ విషయంలో చంద్రబాబుకు ఫోన్ చేసి జేపీ సంగతి కాస్త చూడమన్నారట. అయితే, ఇప్పటికే మల్కాజిగిరి అభ్యర్థి మల్లారెడ్డి నుంచి పార్టీ ఫండ్, ఇతర రూపాల్లో సొమ్ములు నొక్కేసిన పచ్చ నాయకులు మాత్రం ఈ విషయంలో నోరు విప్పట్లేదు. అయితే, బాబు మాత్రం ముందుగానే బీజేపీ తమకు ఈ సీటు ఇచ్చేసింది కాబట్టి మీరే నామినేషన్ ఉపసంహరించుకోవాలని జేపీని కోరారట!