బాబుపై ‘జూనియర్’ అభిమానుల ఆగ్రహం | Junior NTR fans angry on chandra babu | Sakshi
Sakshi News home page

బాబుపై ‘జూనియర్’ అభిమానుల ఆగ్రహం

Published Thu, Apr 24 2014 2:06 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

బాబుపై ‘జూనియర్’ అభిమానుల ఆగ్రహం - Sakshi

బాబుపై ‘జూనియర్’ అభిమానుల ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల కిందటి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల ప్రచారం కోసం రాష్ట్రమంతా పర్యటించిన జూనియర్ ఎన్టీఆర్‌ను ఈసారి కరివేపాకులా తీసేయడాన్ని నందమూరి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పట్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్‌కు ఖమ్మంలో ఘోర ప్రమాదం జరిగి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డ విషయం తెల్సిందే. నాడు ఆస్పత్రి బెడ్ మీది నుంచే టీవీల ద్వారా ప్రచారం చేయించిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబం అవసరం లేకుండా పోయిందా? అని ప్రశ్నిస్తున్నారు. తమ హీరోను పక్కన బెట్టిన చంద్రబాబు... తాజాగా పవన్ కల్యాణ్ ప్రాప కం కోసం పాకులాడడాన్ని అభిమానులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. అవసరానికి ఉపయోగించుకొని వదిలేసే నాయకుడిగా, విశ్వసనీయత లేని వ్యక్తిగా చంద్రబాబుకు ఉన్న పేరు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మరోసారి రుజువైందని సామాజిక వెబ్‌సైట్‌లు, ఇతర ప్రసార సాధనాల ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
 
 ఎన్టీఆర్ కుటుంబాన్నే పక్కనపెట్టారు..
 
 తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ గుర్తుకువస్తారు. పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ను అల్లుడి హోదాలో వెన్నుపోటు పొడిచి సీఎం, పార్టీ అధ్యక్షుడు అయిన బాబు ఆయన మరణానికి కూడా పరోక్ష కారకుడయ్యారని అభిమానులు భావిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరును చెరిపేయడానికి విశ్వప్రయత్నం చేసిన బాబు.. 2004లో ఓటమి తరువాత ఆయన్ను మళ్లీ పార్టీ ప్రచారానికి వాడుకోవ డం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబాన్ని పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారానికి వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన తండ్రి హరికృష్ణ, సోదరుడు కళ్యాణ్‌రామ్ వంటి వారంతా టీడీపీ జెండా లు పట్టి రాష్ట్రమంతా పర్యటించారు. అయినా 2009లో విజయం అందని ద్రాక్షగానే మిగిలింది. తాజా ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ పాత అవతారమే ఎత్తారు. వియ్యంకుడిగా మారిన తన బావమరిది బాలకృష్ణను తప్పనిసరై హిందూపురం బరిలో నిలిపిన బాబు, హరికృష్ణను వదిలేశారు. జూనియర్‌ను గానీ, హరికృష్ణను గానీ బాలకృష్ణ నామినేషన్ సమయంలో కూడా రాకుండా చేయడంలో బాబు పాత్రే కీలకమనే భావన ఉంది. అలాగే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి విశాఖ సీటు ఆశించిన ఎన్టీఆర్ కుమార్తె పురందే శ్వరికి సైతం  చుక్కలు చూపించారు. విశాఖపట్నం సీటుకు అడ్డుపడి కడప జిల్లాలోని రాజంపేట నుంచి పోటీ చేసే పరిస్థితికి కారణమయ్యారు. ఈ పరిణామాలకు తోడు బుధవారం పవన్ కోసం పాకులాడిన తీరు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోంది. తెలంగాణ, సీమాంధ్రల్లో ఈసారి టీడీపీకి దూరంగా ఉండాలని జూనియర్ అభిమానులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement