
మాట మసాలా
ప్రొఫైల్
గోడలెక్కుతారు, గేట్లను తంతారు. ఆడా, మగా తేడా లేకుండా ఉన్నదున్నట్టు ముఖం మీద అనేస్తారు. తర్వాత క్షమాపణలు చెబుతారు. ప్రధానినే ఉరి తీయాలంటారు. ముఖ్యమంత్రిని దద్దమ్మంటారు. మీడియాను చూస్తే శివాలెత్తుతారు. భాష మార్చుకోమని పార్టీ సలహా ఇస్తే సరేనంటారు. ఆ తెల్లారే మరచిపోతారు. తప్పు చేయడం, సరిదిద్దుకోవడం మానవ సహజమంటారు. పుట్టింది చిత్తూరు జిల్లాలో...పెరిగింది గుంటూరులో. చదివింది ఆయుర్వేద వైద్యం. చేస్తున్నది సామ్యవాద రాజకీయం. ధోరణి అతివాదం....శైలి నిత్యనూతనం.మనసు వెన్నలా ఉంటే...మాటను గన్నులా పేల్చే ఆయన మరెవరో కాదు.. కంకణాల నారాయణస్వామి నాయుడు. అలియాస్ డాక్టర్ కె.నారాయణ. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్ల తరువాత 1949 డిసెంబర్ 7న చిత్తూరు జిల్లా నగరి మండలం ఆయనంబాకంలో జన్మించారు. తండ్రి సుబ్బనాయుడు ఓ మోస్తరు రైతు. తల్లి ఆదిలక్ష్మి గృహిణి. ఆ కుటుంబంలో చివరి సంతానమైన నారాయణ కాస్త గారాబంగానే పెరిగారు. నగరి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, మదనపల్లి బీటీ కాలేజీలో పీయూసీ పూర్తి చేశారు. అల్లోపతి చదవడానికి గుంటూరు వెళ్లి ఆయుర్వేదం చేశారు.
కమ్యూనిస్టు ఉద్యమంపై అడుగులు
1970 దశకంలో కమ్యూనిస్టు ఉద్యమం మాంచి ఊపు మీద ఉన్నప్పుడు దానిపట్ల ఆకర్షితులయ్యారు. నారాయణ ఒడ్డూ పొడవు, చొరవ, మాట తీరు అప్పటి గుంటూరు జిల్లా పార్టీ నాయకులుగా ఉన్న వేములపల్లి శ్రీకృష్ణ, కనపర్తి నాగయ్య, వల్లూరి గంగాధరరావు, జీవీ కృష్ణారావు లాంటి వారిని ఆకట్టుకుంది. దీంతో గుంటూరు జిల్లా ఏఐఎస్‌ఎఫ్ బాధ్యతలు అప్పగించారు. 1973లో జిల్లాస్థాయి నుంచి ఏఐఎస్‌ఎఫ్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. అప్పట్లో విద్యార్థి నేతలు పార్టీ నుంచి బయటకు పోకుండా ఉండేందుకు పార్టీ.. సోషలిస్టు దేశాల పర్యటనకు పంపించేంది. అలా నారాయణ 1973లో నాటి తూర్పు జర్మనీ(జీడీఆర్)లో జరిగిన ప్రపంచ యువజనోత్సవాలకు రాష్ట్రప్రతినిధిగా వెళ్లారు. అప్పటికే నారాయణ పరిణతిని గమనించిన పార్టీ నాయకత్వం 1976లో ఆయనను రాయలసీమ విద్యార్థి, యువజన సంఘం బాధ్యతలు చూసేందుకు తిరుపతి కేంద్రంగా పనిచేయమని ఆదేశించింది. ఎనిమిదేళ్ల పాటు ఆ పనిని దిగ్విజయంగా నిర్వహించారు. ప్రతి పనికీ తానే ముందన్నట్టుగా ఇళ్ల స్థలాల మొదలు వ్యవసాయ భూముల స్వాధీనం వరకు అనేక ఉద్యమాలు నిర్వహించారు.
ఉద్యమాలు.. పదవులు
ఉద్యమాలతోపాటే ముందుకుసాగిన నారాయణ 1986లో చిత్తూరు జిల్లాపార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1995లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా, జాతీయ సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సురవరం సుధాకర్‌రెడ్డి ఉన్నారు. జాతీయ పార్టీ అవసరాల దృష్ట్యా సురవరం ఢిల్లీకి మారాల్సి రావడంతో 1999లో నారాయణను పార్టీ సహాయ కార్యదర్శిని చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు. అప్పటి నుంచి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నారు.
మర్చిపోలేని పోరాటం
చిత్తూరు జిల్లా పార్టీ సహాయ కార్యదర్శిగా ఉన్న సమయంలో టీడీపీపై చేసిన పోరాటాన్ని మర్చిపోలేనంటారు నారాయణ. 1985లో తిరుపతిలో ఇళ్ల స్థలాల కోసం ఉద్యమిస్తుంటే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆయనతోపాటు 1500మందిపై భూ ఆక్రమణ కేసులు పెట్టి జైలుపాల్జేసింది. ఆ కేసుల ఎత్తివేతకు ఏకంగా అఖి లపక్ష కమిటీ ఏర్పాటు చేశారు. దానికాయనే అధ్యక్షుడి గా ఉండి అన్ని వర్గాల వారిని సమీకరించి అహర్నిశలు పోరాడి విజయం సాధించారు. ఈ ఘటనను తన జీవితంలో మర్చిపోలేనని తరచూ చెబుతుంటారు. విద్యుత్ వ్యతిరేక పోరాటం తన జీవితంలో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అంశమని అంటారు.
మూడుసార్లు..
సురవరం తర్వాత పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయిన నారాయణ 2007 డిసెంబర్‌లో తిరుపతిలో జరిగిన మహాసభల్లో రెండో సారి, 2012 ఫిబ్రవరిలో కరీంనగర్‌లో జరిగిన మహాసభల్లో మూడో విడత కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనేక సమస్యలపై ముందుండి పోరాటాలు నడిపారు. చైనా, రష్యా దేశాల కమ్యూనిస్టు పార్టీల ఆహ్వానం మేరకు ఇటీవల ఆయా దేశాల్లో పర్యటించి వచ్చారు. తిరిగి కుమార్తె ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లొచ్చారు.
దూరం.. దూరం
పార్టీ పదవుల్లో ముందున్న నారాయణ ఎన్నడూ చట్టసభలకు పోటీ చేయలేదు. ఆ ఆసక్తి కూడా తనకు లేదంటారు. శాసనసభ, లోక్‌సభ సభ్యత్వం కంటే పార్టీ పదవే ఎక్కువంటారు. తన వాగ్ధాటితో, పోరాటపటిమతో పార్టీని జనంలో నిలబెట్టడంలో ఆయన విజయవంత మయ్యారు.
-ఎ. అమరయ్య