మంత్రివర్గంపై కేసీఆర్ కసరత్తు
అధికారంలోకి రావడంపై ధీమా
16+1కే తెలంగాణ కేబినెట్ పరిమితం
అనుబంధ మంత్రిత్వ శాఖల విలీనం
మైనారిటీ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి
జిల్లాలు, సామాజిక వర్గాల ఆధారంగా సమతూకం
సన్నిహితులతో టీఆర్‌ఎస్ చీఫ్ మంతనాలు
తెలంగాణ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని పూర్తి విశ్వాసంతో ఉన్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభించారు. జాతీయ రాజకీయ పరిణామాలు, మూడో ఫ్రంట్ అవకాశాలపై దృష్టి సారిస్తూనే.. తెలంగాణలో అధికారంలోకి వస్తే పార్టీలో ఎవరికి ప్రాధాన్యమివ్వాలన్న దానిపై ఆయన సమాలోచనలు చేస్తున్నారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కొద్ది మంది పార్టీ ముఖ్యులతోనే సమావేశమై పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలున్న నేపథ్యంలో 17 మందిని(ఎమ్మెల్యే స్థానాల్లో గరిష్టంగా 15 శాతం) మించకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయొచ్చు. దీంతో ఇప్పుడున్న 43 మంత్రిత్వ శాఖలను 17కు ఎలా కుదించాలనే దానిపైనా కేసీఆర్ దృష్టి పెట్టారు. భారీ, మధ్యతరహా, చిన్న తరహా నీటిపారుదల శాఖలను విలీనం చేసి ఒకటే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇదే కోవలో వైద్య ఆరోగ్య, వైద్య విద్యా శాఖలను కూడా విలీనం చేయాలనుకుంటున్నారు. ఉన్నత విద్యా శాఖలోనే ప్రాథమిక విద్యను, పంచాయతీ రాజ్‌లోనే గ్రామీణాభివృద్ధి శాఖను, వ్యవసాయంలోనే అన్ని అనుబంధ శాఖలను కలపాలని యోచిస్తున్నారు. పలు శాఖలను విలీనం చేస్తూ అధికారిక విభజన కమిటీలు కూడా ఇప్పటికే నివేదికలిచ్చిన సంగతి తెలిసిందే. ఏకీకృతం చేసిన ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలను జిల్లాల వారీగా సీనియర్లు, గెలిచే అవకాశమున్న విధేయులకు అప్పగించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 17 మంది మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రి, చీఫ్ విప్, ఇద్దరు లేదా ముగ్గురు విప్‌లు తదితర అంశాలపై పార్టీ ముఖ్యులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. అన్ని జిల్లాలకు అవకాశమిస్తూ.. సామాజికవర్గాల మధ్య సమతూకం, నేతల అనుభవం వంటి అంశాల విషయంలోనూ జాగ్రత్త వహిస్తున్నారు.
స్పీకర్‌గా పోచారం?
శాసనసభ స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి(బాన్సువాడ) పేరును కేసీఆర్ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. జూపల్లి కృష్ణారావు(కొల్లాపూర్), కొప్పుల హరీశ్వర్ రెడ్డి(పరిగి), డాక్టర్ సుధాకర్‌రావు(పాలకుర్తి) పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. సామాజికవర్గాల మధ్య సమతూకం పాటించేలా ఈ ఎంపిక ఉంటుంది. హరీశ్వర్ రెడ్డికి గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అయితే న్యాయభాషా పరిజ్ఞానం, ఇతర అంశాలను బట్టి పోచారానికే స్పీకర్‌గా అవకాశమిస్తే మంచిదన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రొటెం స్పీకరుగా ఎవరికి అవకాశమివ్వాలన్న దానిపై ఇంకా స్పష్టత రానట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి ఎన్నికైన సీనియర్లలో ఒకరికి అవకాశమిచ్చే విషయాన్ని కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారు.
ఎవరికి పదవి?
మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై అత్యంత సన్నిహితులతోనే కేసీఆర్ చర్చిస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. ఎమ్మెల్సీ మహమూద్ అలీకి డిప్యూటీ సీఎం ఇవ్వాలనుకుంటున్నారు. ఒకవేళ టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ రాకుంటే మజ్లిస్ మద్దతును తీసుకుని అక్బరుద్దీన్ ఒవైసీకి అవకాశమిచ్చే ప్రతిపాదన కూడా ఉంది. మరో ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని ఉద్యోగుల అంశాలను అప్పగిస్తామని కేసీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారు. నాయిని నర్సింహారెడ్డిని కూడా ఎమ్మెల్సీగా మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వీరితో పాటు రిటైర్డు ఐఏఎస్ అధికారుల్లో ఒకరికి పదవి కట్టబెట్టే యోచన ఉంది. ఇక మెదక్ నుంచే కేసీఆర్ (గజ్వేల్), టి.హరీశ్‌రావు(సిద్దిపేట)తో పాటు సీనియర్ నేత ఎస్.రామలింగారెడ్డి(దుబ్బాక) కూడా ఉండటంతో జిల్లాకు ఎక్కువ పదవులు ఇస్తే విమర్శలు వస్తాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
కేబినెట్‌లో వీరికే అవకాశం!
హైదరాబాద్: మహమూద్ అలీ (డిప్యూటీ సీఎం), నాయిని నర్సింహారెడ్డి, టి.పద్మారావు
రంగారెడ్డి: కె.హరీశ్వర్ రెడ్డి
మహబూబ్‌నగర్: డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు (సామాజికవర్గం ప్రతిబంధకమయ్యే అవకాశముంది)
మెదక్: కె.చంద్రశేఖర్‌రావు(సీఎం), టి.హరీశ్‌రావు, ఎస్.రామలింగారెడ్డి లేదా పద్మా దేవేందర్‌రెడ్డి
నిజామాబాద్: పోచారం శ్రీనివాస్‌రెడ్డి(స్పీకర్), ఏనుగు రవీందర్ రెడ్డి లేదా గంపా గోవర ్థన్
కరీంనగర్: కె.తారక రామారావు, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్
ఆదిలాబాద్: నల్లాల ఓదేలు లేదా జోగు రామన్న
వరంగల్: చందూలాల్, కొండా సురేఖ లేదా సత్యవతీ రాథోడ్, డాక్టర్ సుధాకర్‌రావు
నల్లగొండ: జి.జగదీశ్‌రెడ్డి, జి. సునీతా మహేందర్‌రెడ్డి