ఇక గాలిమోటర్లోనే కేసీఆర్
ఎన్నికల వేళ తెలంగాణ ఊరూవాడా విమానమే శరణ్యం అంటున్నారు టీఆర్ ఎస్ చీఫ్ కేసీఆర్. ఎన్నికల ప్రచారం చేయాలంటే ఆకాశమార్గాన వెళ్లడమే మేలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది. ఒక హెలీకాప్టర్ ను ఆయన అద్దెకు తీసుకన్నట్టు తెలుస్తోంది. ఆ లోహవిహంగం ఇప్పటికే ఆయన ఫార్మ్ హౌస్ కు చేరుకుందని కూడా కథనాలు వినవస్తున్నాయి.
అంతే కాదు... తన ఫార్మ్ హౌస్ నే ఆయన పార్టీ ఎన్నికల మినీ హెడ్ క్వార్టర్స్ గామార్చబోతున్నట్టు తెలుస్తోంది. అయితే హెలీకాప్టర్ ప్రయాణ ఖర్చుల వివరాలను ఆయన త్వరలోనే ఎన్నికల సంఘానికి సమర్పించబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మామూలుగా సింగిల్ ఇంజన్ హెలీకాప్టర్ గంటకి 70000 నుంచి 80000 ఖర్చవుతుంది. డబుల్ ఇంజన్ హెలీకాప్టర్ రెండింతలు ఖర్చవుతుంది. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు హెలీకాప్టర్ ను వాడటం అరుదు. జాతీయ నాయకులు మాత్రమే హెలీకాప్టర్ ను వాడుతూంటారు.