
అద్వానీకి కూడా మాట్లాడటం రాదు
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పెద్ద గొప్ప వక్త కాదని చెప్పి సంచలనం సృష్టించిన ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఉమాభారతి మరో బాంబు పేల్చారు.
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పెద్ద గొప్ప వక్త కాదని చెప్పి సంచలనం సృష్టించిన ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఉమాభారతి మరో బాంబు పేల్చారు. పార్టీలో కురువృద్ధ నేత ఎల్కే అద్వానీకి కూడా మాట్లాడటం రాదన్నారు. 'అద్వానీ మంచి వక్త కాదని నేను ఇంతకుముందే చెప్పాను. అలాగని దాన్ని ప్రతికూలంగా తీసుకోకూడదు. అది ఓ అంచనా మాత్రమే. నేను మోడీ గురించి చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుదోవ పట్టించింది' అని ఉమాభారతి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అన్నారు. ఆమె అదే ప్రాంతం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే, తనను తాను సమర్థించుకునే ప్రయత్నంలో ఉమాభారతి మరో పెద్ద వివాదానికి దారి తీశారు. 'వాజ్పేయి అద్భుతమైన వక్త. భారత రాజకీయాల్లోనే ఆయనలాంటి వక్త లేనే లేరని అందరూ అంటుంటారు. మీరు శ్రద్ధగా గమనిస్తే మోడీ అంత మంచి వక్త కాదని తెలుస్తుంది. జనాలు ఆయన ర్యాలీలకు వెళ్తున్నారంటే ఆయన ప్రసంగం కోసం కాదు.. ఈ దేశాన్ని మార్చాలని, అందుకు తామంతా ఆయన వెంట ఉంటామని చెబుతున్నట్లు లెక్క' అని కూడా ఉమాభారతి అన్నారు.