అద్వానీని చోటా నేతగా మార్చేశారు: రాహల్‌గాంధీ
మోడీ, బీజేపీపై రాహుల్ విమర్శల దాడి
సాక్షి, బెంగళూరు: బీజేపీపై, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహల్‌గాంధీ విమర్శల వాడిని పెంచారు. బీజేపీ అగ్రనేత అద్వానీని వాడుకుని... ఇప్పుడు ఓ చోటా నేతగా మార్చేశారని దుయ్యబట్టారు. రాహుల్ సోమవారం కర్ణాటకలోని బెంగళూరు, రాయచూరు, శిరసిలలో జరిగిన ప్రచార సభల్లో ప్రసంగించారు. ‘‘మీకు బీజేపీ అగ్రనేత అద్వానీజీ గుర్తుండే ఉంటారు. ఇక ఆయనెంత మాత్రమూ అగ్రనేత కాదు. ఒకప్పుడు ఆయన్ను వాడుకున్న పార్టీ, ఇప్పుడు ఓ చిన్న నేతగా మార్చేసింది’’ అని రాహుల్ విమర్శించారు. సేవకుడికి అధికారాన్నివ్వండన్న మోడీ పిలుపుపై స్పందిస్తూ... ‘‘ఇంటి తాళంచెవిని కాపలాదారుడికి ఇస్తే ఇల్లు గుల్లవుతుంది. మీ ఇంటి కీ మీ చేతుల్లోనే ఉండాలి’’ అని రాహుల్ అన్నారు. గుజరాత్ అభివృద్ధి గురించి మోడీ చెబుతున్నదంతా బూటకమని విమర్శించారు.