ఇద్దరూ రెండు పార్టీల ఎన్నికల ప్రచారానికి సారథులు. ఇద్దరూ రోజుకి మూడు నుంచి ఆరు ఎన్నికల సభల్లో ప్రసంగించి కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. దేశమంతా పర్యటిస్తున్నారు. కార్యకర్తలతో చర్చలు జరిపి, సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. మండు వేసవిలోనూ తమ పనిని నిరంతరాయంగా చేసుకుపోతున్నారు.
ఒక నాయకుడు బిజెపి ఎన్నికల సారథి, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అయితే మరొకరు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. ఈ ఎన్నికల ప్రచార సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, రోజు రోజంతా ఉత్సాహాన్ని నిలబెట్టుకోవడం వీరిద్దరికీ చాలా ముఖ్యం.
అంతే కాదు. తమ గొంతు బొంగురు పోకుండా చూసుకోవడం అటు రాహుల్ కి, ఇటు మోడీకి చాలా అవసరం. అందుకే ఇద్దరూ అసలు చల్లనీళ్లు తాగరు. వీలైతే గోరు వెచ్చని నీరు తాగడం చేస్తూంటారు. వయసు దృష్ట్యా రాహుల్ చాలా ఆరోగ్యంగా, తగిన బరువు ఉన్నారు. 63 ఏళ్ల మోడీ ది స్థూలకాయం.
ఇద్దరు నాయకులూ సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తారు. రాహుల్ గాంధీ అప్పుడప్పుడూ రాత్రి ఆలస్యంగా పడుకుంటారు. అయినప్పటికీ ఉదయం మాత్రం అయిదింటికి లేచి తీరాల్సింది. రాహుల్ జాగింగ్, వీలైతే జిమ్ లలో వ్యాయామం చేస్తూంటారు. మోడీ మాత్రం యోగ, ప్రాణాయామాలనే నమ్ముకున్నారు. ఉదయమే తప్పనిసరిగా యోగ చేయడం ఆయనకు చాలా కాలం నుంచి అలవాటు.
ఇక భోజనం విషయానికి వస్తే ఇద్దరూ మితాహారులే. మోడీ ఉదయం అల్పాహారంలో పోహా, సేవ్ వంటివి తీసుకుంటారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆయన ఉపవాసాలు నియమబద్ధంగా చేస్తూంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రులు, శ్రీరామనవమి సమయంలో ఆయన ఉపవాసాలు ఉంటారు. ఆ సమయంలో కొద్దిగా పళ్లు మాత్రమే తీసుకుంటారు. రాహుల్ బ్రేక్ ఫాస్ట్ హెవీగా ఉన్నా, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు చాలా పరిమితంగా ఉంటాయి. ఆయన అప్పుడప్పుడూ మధ్యాహ్న భోజనాలు ఏరాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో దొరికే ఆహారాన్నే తీసుకుంటారు.
ఇక సాధారణ ఆరోగ్యం విషయానికి వస్తే రాహుల్ గాంధీ తన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. మోడీకి చాలా కాలంగా నడుము నొప్పి ఉంది. అది బాధపెడుతున్నా లెక్కచేయకుండా ఆయన తన పర్యటన కొనసాగిస్తున్నారు.
ఎన్నికల పర్వం పూర్తయేలోపు మోడీ మరో 150 సభల్లో ప్రసంగించబోతున్నారు. రాహుల్ కూడా కనీసం వంద సభల్లో ప్రసంగించనున్నారు. రాబోయే అయిదేళ్ల రాజకీయ దశ, దిశను నిర్ధారించే ఎన్నికల విషయంలో ఈ నేతలు ఇద్దరూ ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారో అంతే ప్రణాళికా బధ్దం గా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలోనూ వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం పోయినట్టయితే అన్నీ పోయినట్టే అన్న సూక్తిని అక్షరాలా పాటిస్తున్నారు.