
టూరెత్తుతున్న ఎన్నికలు...
* ప్యాకేజీ టూర్లు అందిస్తున్న ట్రావెల్ సంస్థలు
* పోటెత్తుతున్న విదేశీ పర్యాటకులు
పన్యాల జగన్నాథ దాసు: కుంభమేళాలు, పుష్కరాలు వంటి వాటికి పర్యాటకులు పోటెత్తడం మామూలే. చారిత్రక ప్రదేశాలను, పుణ్యక్షేత్రాలను తిలకించేందుకు ట్రావెల్ సంస్థలు ప్యాకేజీ టూర్లు నిర్వహించడమూ మామూలే. ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో కాస్త కొత్తగా ఆలోచించిన ట్రావెల్ సంస్థలు ఎన్నికల పర్యాటకం కోసం ప్యాకేజీ టూర్లు అందిస్తున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రహసనాన్ని తిలకించేందుకు విదేశీ పర్యాటకులు పోటెత్తుతుండటంతో ట్రావెల్ సంస్థలకు కాసుల పంట పండుతోంది. రాజకీయ దిగ్గజాలు తలపడే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారసభలు చూపించడంతో పాటు రాజకీయ నేతలను, ఎన్నికల కమిషన్ అధికారులను కలుసుకునే అవకాశం కల్పిస్తుండటంతో విదేశీ పర్యాటకులు ఈ ప్యాకేజీ టూర్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఏడు పగళ్లు, ఆరు రాత్రులు సాగే ఈ ప్యాకేజీ టూర్లకు ట్రావెల్ సంస్థలు కేవలం 1200 డాలర్లు (రూ.72,131) మాత్రమే వసూలు చేస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, నైజీరియా, యూఏఈ వంటి దేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు ఎన్నికల పర్యటన కోసం వస్తున్నారు.
గుజరాత్‌లో 2012 అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఎన్నికల పర్యాటకం విజయవంతం కావడంతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరిన్ని ట్రావెల్ సంస్థలు ప్యాకేజీ టూర్లు నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి. అంచనాలకు మించి పర్యాటకులు వస్తుండటంతో ట్రావెల్ సంస్థల నిర్వాహకులు సంబరపడుతున్నారు. ఎన్నికల పర్యాటకానికి ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులు దేశం నలుమూలల్లోని కీలక ప్రాంతాలన్నింటినీ చూసేందుకు ఆసక్తి చూపుతుంటే, గుజరాత్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐలు మాత్రం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ‘ఆప్’ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తలపడుతున్న వారణాసిపైనే ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.
ప్రముఖుల నియోజకవర్గాలపై విదేశీయుల ఆసక్తి..
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ, మోడీ పోటీ చేస్తున్న వారణాసి, వడోదర నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. భారత్‌లో ఎన్నికల ప్రచారం జరిగే తీరును తిలకించేందుకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని గుజరాత్‌కు చెందిన అక్షర్ ట్రావెల్స్ నిర్వాహకుడు లవ్ శర్మ చెప్పారు. బ్రిటన్, జర్మనీ, దుబాయిల నుంచి ఇప్పటికే నాలుగు బృందాల పర్యాటకులు తమ వద్ద ముందుగానే ప్యాకేజీ టూర్లు బుక్ చేసుకున్నారని, ఒక్కో బృందంలో 90 మంది చొప్పున పర్యాటకులు ఉంటారని ఆయన తెలిపారు.
ఇక్కడి ఎన్నికల తతంగాన్ని తిలకించేందుకు వస్తున్న విదేశీ పర్యాటకుల్లో ఎక్కువ మంది అక్కడి రాజకీయ పార్టీల కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు ఉంటున్నారని ‘కాక్స్ అండ్ కింగ్స్’ ఉపాధ్యక్షుడు సంజీవ్ ఛజేర్ తెలిపారు. సాధారణంగా వేసవిలో విదేశీ పర్యాటకుల రాక తక్కువగా ఉంటుందని, అయితే, ఈ ఎన్నికల సీజన్‌లో 25 వేల నుంచి 30 వేల మంది విదేశీ పర్యాటకులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ అధ్యక్షుడు సుభాష్ గోయల్ చెప్పారు. విదేశీ పర్యాటకుల కారణంగా హోటళ్ల బుకింగ్‌లూ గణనీయంగా పెరిగాయి. కేవలం అహ్మదాబాద్‌లోనే హోటళ్ల బుకింగ్‌లు ఏకంగా 60 శాతం మేరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.