జైలుకైనా వెళ్తా... బదిలీ చేయను: మమతా బెనర్జీ
ఎన్నికల కమిషన్‌పై మమత ఆగ్రహం
కోల్‌కతా: ఎన్నికల అధికారుల బదిలీ అంశం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి.. కేంద్ర ఎన్నికల సంఘానికి మధ్య చిచ్చు రాజేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఐదుగురు ఎస్‌పీలు, ఒక జిల్లా మేజిస్ట్రేట్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఈసీ సోమవారం పశ్చిమబెంగాల్ సర్కారును ఆదేశించింది. అయితే తాను సీఎంగా ఉన్నంత వరకూ ఒక్క అధికారిని కూడా బదిలీ చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే తాను జైలుకెళ్లేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని మమతాబెనర్జీ తేల్చిచెప్పారు. ఆదివారం పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం పరిశీలించింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ కొందరు అధికారులపై ఈసీకి ఫిర్యాదులందాయి.
దీంతో మాల్దా, ముర్షిదాబాద్, బుర్‌ద్వాన్, వెస్ట్ మిడ్నాపూర్, జార్‌గ్రామ్ ఎస్పీలు, ఉత్తర 24 పరగణాల జిల్లా మేజిస్ట్రేట్‌లను విధుల నుంచి తప్పించాలని, వారికి ఎన్నికలతో సంబంధం లేని విధులను అప్పగించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఓ జిల్లా ఎన్నికల అధికారిని, ఓ ఏడీఎంను, ఓ రిటర్నింగ్ అధికారిని కూడా బదిలీ చేసింది. దీనిపై మమత స్పందిస్తూ.. ‘‘మీరు(ఈసీ) శాంతి, భద్రతలు నియంత్రిస్తానంటే నాకు అభ్యంతరం లేదు. ఏదైనా సమస్య వస్తే మమతా బెనర్జీని నిందించవద్దు. అయితే మమతా బెనర్జీ శాంతిభద్రతలను పర్యవేక్షించాలి. లేదా ఎన్నికల సంఘం పర్యవేక్షించాలి. సోనియాగాంధీ పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనో.. నరేంద్రమోడీ రాష్ట్రం లోనో మీరు వెళ్లి ఇలాంటి చర్యలు తీసుకోగలరా అని నేను ఎన్నికల కమిషన్‌కు సవాల్ చేస్తున్నా. ఆ తర్వాతే మాపై చర్యలకు రావాలి’’ అని అన్నారు.