న్యూఢిల్లీ: అక్రమంగా పుట్టిన సంతానమైనా వారి జీవికకు అవసరమైన భృతిని తండ్రి అయిన వ్యక్తి చెల్లించాల్సిందేనని ఢిల్లీలోని ఓ కోర్టు స్పష్టం చేసింది. బిడ్డ తల్లితో సెటిల్‌మెంట్ ఒప్పందం చేసుకుని వేరుపడినప్పటికీ.. ఆ బిడ్డకు భృతిని ఇవ్వకుండా తండ్రి తప్పించుకోజాలరని ఈ మేరకు ఓ కేసులో కింది కోర్టు తీర్పును అదనపు సెషన్స్ కోర్టు సమర్థించింది. బిడ్డ పుట్టకముందే తల్లికి తాను రూ.50 వేలు చెల్లించి సెటిల్‌మెంట్ ఒప్పందం చేసుకుని వేరుపడ్డానని, అందువల్ల ఆ బిడ్డ బాగోగులు చూడాల్సిన బాధ్యత తనకు లేదంటూ పిటిషనర్ చేసిన వాదనను జడ్జి తోసిపుచ్చారు.
బిడ్డ జనన ధ్రువపత్రంలో తండ్రిగా అతడి పేరే ఉందని, ఇతర ఆధారాలను బట్టి చూసినా ప్రాథమికంగా ఆ బిడ్డకు పిటిషనరే తండ్రిగా తెలుస్తోందని జడ్జి అభిప్రాయపడ్డారు. డీఎన్‌ఏ పరీక్షకు కూడా ఆదేశించినా.. అది విచారణలో భాగమని, ప్రస్తుతం సీఆర్‌పీసీ సెక్షన్ 125 ప్రకారం.. చట్టబద్ధమైన బిడ్డ మాదిరిగానే ఆ బిడ్డకు కూడా నెలకు రూ. 2 వేల చొప్పున భృతిని చెల్లించాలని జడ్జి ఆదేశించారు.