టీ క్రెడిట్ మాదే: మన్మోహన్‌సింగ్
ఆ ఘనతను సొంతం చేసుకోవడానికి చిన్నాచితకా పార్టీలు పాకులాడుతున్నాయి
తెలంగాణను అడ్డుకొనేందుకు అనేక పక్షాలు ప్రయత్నించాయి
బీజేపీ లోపల ఒకటి పెట్టుకుని.. బయటికి మరొకటి మాట్లాడుతోంది
దేశంలో అశాంతిని ప్రేరేపించడానికి వర్గాల మధ్య చిచ్చు పెడుతోంది
నల్లగొండ జిల్లా భువనగిరి సభలో ప్రధాని ప్రసంగం
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత పూర్తిగా తమదేనని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్ని చిన్నాచితకా పార్టీలు.. తెలంగాణ తెచ్చిన ఘనతను సొంతం చేసుకోవడానికి పాకులాడుతున్నాయని పరోక్షంగా టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని కూనూరు వద్ద శనివారం నిర్వహించిన బహిరంగ సభలో మన్మోహన్ ప్రసంగించారు.
‘‘తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేస్తున్న సందర్భమిది. కేవలం కాంగ్రెస్, సోనియాగాంధీ కృషి, తోడ్పాటు, అకుంఠిత దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. కాంగ్రెస్ కాకుండా మరే ఇతర పార్టీకీ ఇది సాధ్యమయ్యేది కాదు. తెలంగాణను అడ్డుకునేందుకు అనేక పక్షాల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా మా ప్రయత్నంలో వెనకడుగు వేయకుండా మాట నిలబెట్టుకున్నాం. తెలంగాణ కోసం మహోద్యమాన్ని నిర్మించిన వారి కృషి, అమరుల త్యాగాలు ఏ మాత్రం వృథా కాబోవు. మనందరం కలిసి దేశంలో అందరూ మెచ్చదగిన రీతిలో ప్రత్యేక తెలంగాణను అభ్యున్నతి పథ ంలో తీసుకె ళ్లాలి..’’ అని మన్మోహన్ పేర్కొన్నారు. అందరి ఆశీర్వాదాలతో తెలంగాణలో తొలి ప్రభుత్వంగా కాంగ్రెస్ ఏర్పడితే.. దాని ద్వారా ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి పథాన నడిపించడానికి, నవయోధుల ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు, వారికి ఉపాధి కల్పించడానికి కాంగ్రెస్ ఇతోధికంగా పనిచేస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశాం..
‘‘ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి యూపీఏ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. దీనివల్ల హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక సంస్థల ఆవిర్భావం సాధ్యమైంది. మెదక్‌లో ఐఐటీ స్థాపన, హైదరాబాద్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డి జైన్ ఏర్పాటు, అంతర్జాతీయ విమానాశ్రయం, శరవేగంగా జరుగుతున్న మెట్రో రైలు నిర్మాణం వంటివి కాంగ్రెస్‌తోనే సాధ్యమయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో కొత్త విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ చేతిలో ఉంది..’’ అని మన్మోహన్ చెప్పారు.
లోపల ఒకటి.. బయటికి మరొకటి..
బీజేపీ మనసులో ఒకటి ఉంచుకుని, బయటకుమరొకటి మాట్లాడుతోందని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న వర్గాల మధ్య చిచ్చుపెట్టి అశాంతిని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘కొద్దిరోజులుగా బీజేపీ ఏవేవో సందేశాలు ఇస్తున్నట్లుగా మాట్లాడుతోంది. వారి మనసులో ఉన్నదొకటైతే.. బయటకు వెళ్లగక్కేది మరొకటి. దేశంలో ప్రశాంతంగా ఉన్న వర్గాల మధ్య చిచ్చుపెట్టి అశాంతిని ప్రేరేపించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. కేవలం ఒకే వ్యక్తి మీద ఆధారపడి బీజేపీ ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఏ రకంగానూ సాధించలేని వాగ్దానాలు చేస్తున్నారు..’’ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత ఎటువంటి ప్రభుత్వం రావాలనేది ప్రజల చేతిలోనే ఉందన్నారు.
చట్టాలను అడ్డుకున్నారు..
విపక్షాలు తమపై అనవసరపు నిందలు మోపుతున్నాయని, కానీ, తాము ఎంతో నిజాయితీగా దేశంలో అవినీతిని తగ్గించడం కోసం పాటుపడుతున్నామని మన్మోహన్ పేర్కొన్నారు. అవినీతిని రూపుమాపాలన్న లక్ష్యంతో మరిన్ని చట్టాలు తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తే... పార్లమెంట్‌లో బీజేపీ అడుగడుగునా అడ్డుపడిందని ఆరోపించారు. అవినీతిని రూపుమాపడానికి బీజేపీ చేస్తున్న కృషి ఏపాటిదో దీనితోనే స్పష్టమవుతోందని చెప్పారు.
పేదరికాన్ని తగ్గించాం...
‘‘ పదేళ్ల క్రితం ప్రజల తీర్పుతో యూపీఏ సర్కారు వచ్చింది. దాన్ని మేం శిరసావహించి నిజాయితీతో పనిచేశాం. దాంతో 2009లో మరోసారి మాకు అధికారం ఇచ్చారు. ఈ క్రమంలో అనేక రంగాల అభివృద్ధికి కృషి చేశాం. 2004 -2011 మధ్య పేదరికం మూడు రెట్లు తగ్గింది. 14 కోట్ల మందిని పేదరికం, ఆకలి నుంచి దూరం చేశామని సగర్వంగా చెబుతున్నాం. వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడం కోసం, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం మేం తలపెట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయి. విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఫలితంగా దేశంలోని ప్రతి చిన్నారికి ప్రాథమిక విద్యనభ్యసించే అవకాశం లభించింది..’’ అని మన్మోహన్ పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్, ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, రాష్ట్ర మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.