సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఓ పోలీసు ఉన్నతాధికారి ప్రవేశం మాజీ మంత్రి శైలజానాథ్ జాతకాన్నే మార్చేసింది. ఆ పోలీసు అధికారి మరదలైన యామినీబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. టీడీపీ టికెట్ దక్కినట్లే దక్కి చేజారడంతో శైలజానాథ్ తీవ్రంగా మనస్థాపం చెందారు. చివరకు కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలో ఉంటానని మరో సెట్ నామినేషన్‌ను దాఖలు చేయడం రాష్ట్రంలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. శింగనమల టీడీపీ అభ్యర్థిగా బండారు రవికుమార్‌ను రెండో జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేసిన విషయం విదితమే. ఇప్పటికే ఓ సెట్ నామినేషన్‌ను దాఖలు చేసిన రవికుమార్.. శనివారం అట్టహాసంగా మరో సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. కుదిరిన ఒప్పందం మేరకు పైకం ముట్టజెప్పకపోవడంతో బండారు రవికుమార్‌కు ఇచ్చిన టికెట్‌ను చంద్రబాబు వెనక్కి తీసుకున్నారు. ఇందులో అనంతపురం లోక్‌సభ అభ్యర్థి జేసీ దివాకర్‌రెడ్డి హస్తం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది పసిగట్టిన మాజీ మంత్రి శైలజానాథ్ గురువారం అర్ధరాత్రి నుంచి టీడీపీ టికెట్ పొందేందుకు సీఎం రమేష్ ద్వారా ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ.. ఈనెల 15న కాంగ్రెస్ అభ్యర్థిగా శింగనమల శాసనసభ స్థానానికి శైలజానాథ్ నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. ఇదే సమయంలో చంద్రబాబుకు సన్నిహితుడుగా ముద్రపడ్డ ఓ పోలీసు ఉన్నతాధికారి రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్సీ శమంతకమణికి అల్లుడైన ఆ పోలీసు ఉన్నతాధికారి.. శింగనమల టికెట్ తన మరదలు యామినీ బాలకు ఇవ్వాలని కోరారు. ఇందుకు అంగీకరించిన చంద్రబాబు.. ఆ మేరకు సంకేతాలు పంపారు. తన బావ చెప్పిన మేరకు యామినీ బాల గార్లదిన్నె ఏంఈవో ఉద్యోగానికి రాజీనామా చేసి శనివారం నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు.
ఆమెకు శుక్రవారం అర్ధరాత్రి ప్యాక్స్ ద్వారా బీ-ఫారం చేరింది. యామినీ బాలకు టికెట్ ఖరారు కావడాన్ని పసిగట్టిన శైలజానాథ్.. సీఎం రమేష్ ద్వారా చంద్రబాబుకు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఆ ఫ్యాన్సీ ఆఫర్‌కు లొంగిపోయిన చంద్రబాబు శైలజానాథ్ వైపు మొగ్గు చూపారు. శనివారం ఉదయం ఫ్యాక్స్ ద్వారా శైలజానాథ్‌కూ మరో వైపు బీ-ఫారం అందింది. తనకు బీ-ఫారం అందడంతో శనివారం ఉదయం శింగనమల శాసనసభకు యామినీ బాల నామినేషన్ వేశారు. ఇదే సమయంలో శైలజానాథ్ కూడా టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి అనంతపురం నుంచి బయలుదేరారన్న సమాచారం అందుకున్న యామినీ బాల, ఎమ్మెల్సీ శమంతకమణి.. అదే అంశాన్ని పోలీసు ఉన్నతాధికారికి వివరించినట్లు సమాచారం.
ఈ సమాచారాన్ని అందుకున్న ఆ పోలీసు ఉన్నతాధికారి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పోలీసులను ప్రభావితం చేసేందుకు ఆ అధికారి ఉపయోగపడతాడని భావించిన చంద్రబాబు.. చివరకు యామినీ బాలకే టికెట్ ఖరారు చేశారు. చివరి నిముషంలో చంద్రబాబు తనకు మొండిచేయి చూపడంతో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి సిద్ధం చేసిన సెట్‌ను శైలజానాథ్ పక్కన పెట్టేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మరో సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. కానీ.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఓబుళేసు.. తానే అసలైన కాంగ్రెస్ అభ్యర్థినని, పీసీసీ చీఫ్ రఘువీరా తనకే టికెట్ ఇచ్చారని హడావుడి చేయడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి.. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి, ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు విఫలయత్నం చేసిన శైలజానాథ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఆయన అనునయులే వ్యాఖ్యానిస్తుండటం కొసమెరుపు.
శైలూ.. అభాసుపాలు!
Published Sun, Apr 20 2014 2:23 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement