సాక్షి, ఒంగోలు : ఎన్నికల కాలం వచ్చింది. ముస్లిం, మైనార్టీల ఓట్లు ఎటు పడనున్నాయి? ప్రతీసారి ఓటర్లుగానే మిగులుతున్న ముస్లింలు నాయకులుగా ఎదిగేందుకు కాలం సమీపంలోనే ఉంది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరు పట్టణాలు, గ్రామాల్లో హోరెత్తుతుండగా ఆయా పదవులకు సంబంధించి విజేతల మెజార్టీలో మైనార్టీల ఓట్లే కీలకంగా మారనున్నాయి. జిల్లావ్యాప్తంగా అధికారిక గణాంకాల ప్రకారం.. 2.90 లక్షల మంది ముస్లిం, మైనార్టీ జనాభా ఉన్నారు.
ఇందులో 60శాతం మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. చీరాల, అద్దంకి, కొండపి, మార్కాపురం తదితర నియోజకవర్గాల్లో 10వేల లోపు ముస్లింలు ఉండగా మిగతా చోట్ల 15 వేలకు మించి ఉన్నారు. పర్చూరు నియోజకవర్గంలో అత్యధికంగా 25 వేల మంది ఉన్నారు. ప్రధానంగా ప్రతీ ఎన్నికల్లోనూ గెలిచే నాయకుడి మెజార్టీని పరిశీలిస్తే.. 20శాతం ఓట్లు తేడా కనిపిస్తోంది. తేడా కనిపించే ఓటింగ్‌లో ఎక్కువగా మైనార్టీ ఓటింగ్ మిళితమై ఉంటుందనేది రాజకీయవర్గాల విశ్లేషణ. మైనార్టీల సెంటిమెంట్ ప్రకారం.. గెలిచే రాజకీయ పార్టీకే ఓటేస్తారనేది నానుడి. దీన్ని అనేక ఎన్నికల్లోనూ నిజం చేశారంటూ రాజకీయ విశ్లేషకులు సైతం ధ్రువీకరిస్తున్నారు.
మారిన జీవనశైలి నేపథ్యంలో..
పల్లెల నుంచి పట్టణాలకు పిల్లలను పంపి మెకానిక్‌లుగా మార్చే రోజులు పోయాయి. గ్రామాల్లో కొలిమి పనులు చేస్తూ.. సుత్తులు, ఇనుపరాడ్‌లు మోసి మండుటెండలో కాగిపోయే కాలం మారిపోయింది. నేడు ముస్లిం, మైనార్టీ కుటుంబాల పిల్లలు చదువుపై శ్రద్ధచూపుతున్నారు. కుట్టుమిషన్‌తో కుటుంబాన్ని నడుపుతున్న నిరుపేద తండ్రి.. తన కొడుకును ఇంజినీరింగ్ చదివిస్తున్నాడు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 4శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఆశయం నెరవేరడమే.. వారిపాలిట వరమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లోనే కాకుండా చట్టసభల్లో వారికిచ్చిన ప్రాధాన్యత సాధారణ విషయమేమీ కాదు. తోపుడుబండ్లపై కాయగూరలు, పండ్లు పెట్టుకుని అమ్ముకోవడం, పాత ఇనుపసామాను వ్యాపారంతో రెక్కలుముక్కలు చేసుకుంటున్న మైనార్టీ కర్షకుల బతుకులను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గరగా చూసిన నేత.
రాజకీయ జీవితం ఆరంభం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించిన కడప నియోజకవర్గంలో మైనార్టీ ఓటింగ్‌ను అండగా నిలుపుకున్నారు. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొన్న ఈతిబాధలను ఆలకించి రిజర్వేషన్ విధాన నిర్ణయం తీసుకున్నారు. అయితే, అప్పట్లో ఆయన ఆలోచనకు గండికొట్టాలని ప్రయత్నించిన పలు రాజకీయ పార్టీలకు న్యాయస్థానాల ద్వారా గట్టి సమాధానం ఇప్పించిన ఘనుడాయన. రాజకీయ చరిత్రలో ముస్లిం, మైనార్టీలకు ఈ రిజర్వేషన్ అంశం సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఆసరాగా జిల్లాలో మైనార్టీ నేతలు తమ గుర్తింపును మరింత చాటుకునేలా రాజకీయల్లో ఎదుగుతున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోనూ గడిచిన నాలుగేళ్ల కాలంలో వీఆర్‌వో, వీఆర్‌ఏ ఉద్యోగాలను నాలుగు శాతం రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందిన విద్యావంతులు ఎందరో ఉన్నారు.
అదేవిధంగా ముందెన్నడూ లేనివిధంగా గ్రామస్థాయి నుంచి వైద్యవృత్తిలోకి వెళ్తున్న ముస్లిం విద్యార్థులూ కనిపిస్తున్నారు. దివంగత వైఎస్సార్ నాయకత్వాన ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు టీడీపీ పాలనలో మైనార్టీలు అనేక కష్టాలు అనుభవించారు. పలు ప్రభుత్వ పథకాలు ఆచరణకు నోచుకోక.. చంద్రబాబును తిట్టుకున్న రోజులున్నాయని విద్యావంతులు చెబుతున్నారు. వైఎస్ పాలనాపగ్గాలు చేపట్టాక ఉపాధ్యాయ వృత్తితో పాటు వైద్యరంగంలో కూడా అనేకమంది అడుగిడారు. ఆయా లబ్ధిదారుల కుటుంబాలు నేడు దివంగత వైఎస్ ఫొటోలను దేవుని మందిరాల్లో పెట్టుకుని పూజిస్తున్నాయని, తరతరాలు ఆయన మేలును మైనార్టీలు మరిచిపోరని సామాజికవర్గ పెద్దలు చెబుతుండటం విశేషం.
రాజకీయ గుర్తింపునకూ ప్రయత్నాలు
మైనార్టీలను చిన్నచూపు చూస్తూ అరాకొరా నిధులు విదిల్చిన ప్రభుత్వాలకు మైనార్టీలు తగిన బుద్ధిచెప్పిన సంఘటనలు లేకపోలేదు. గడిచిన పదేళ్లకాలంలో టీడీపీని ప్రతిపక్ష హోదాకే పరిమితం చేయడంలో ముస్లిం ఓటింగ్ తీవ్ర ప్రభావం చూపిందని స్వయాన ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మేలు పథకాలతో పాటు వృద్ధులకు పెన్షన్‌లు, మసీదులు, షాదీఖానాల నిర్మాణం చేపట్టిన దివంగత వైఎస్సార్‌ను మైనార్టీలు ఈ నాటికీ గ్రామాల్లో కీర్తిస్తున్నారు.
ఆయన హఠాన్మరణంతో వారికి మేలు పథకాలు అందడం లేదు. గతంలో మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్‌లకు నెలకు రూ.3500 చొప్పున గౌరవ వేతనం అందించేవారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఆ విధానానికి స్వస్తిపలికారు. వైఎస్ హయాంలో జిల్లావ్యాప్తంగా 36 షాదీఖానాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇవ్వగా వాటిల్లో 29కి నిధులు కూడా మంజూరయ్యాయి. ఇప్పటికే 14 షాదీఖానాలు నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. మార్కాపురం, కందుకూరుతో పాటు మరికొన్ని చోట్ల షాదీఖానాల నిర్మాణం ఆగిపోవడానికి వైఎస్ అనంతరం వచ్చిన ముఖ్యమంత్రుల నిర్లక్ష్య వైఖరే కారణమైంది.
ఈ నేపథ్యంలో ముస్లింలు రాజకీయ గుర్తింపునకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లోనూ వీరిసత్తా చాటుకునేందుకు పోటీపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వీరి భాగస్వామ్యం తక్కువేమీ కాదు. ఆ పెద్దాయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అపార నమ్మకం ఉందని, ఎన్నికల్లో ఆయనకు పట్టం కట్టేందుకు ముస్లిం కుటుంబాలన్నీ సిద్ధంగా ఉన్నాయనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
గెలుపునకు ‘మెజార్టీ’
Published Fri, Mar 28 2014 2:58 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement