
మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న కన్నుమూత
ఆలూరు, మాజీ ఎమ్మెల్యే, ైవైఎస్సార్సీపీ నేత మసాల ఈరన్న(78) కర్నూలుజిల్లా ఆలూరులో గురువారం ఉదయం కన్నుమూశారు. దీర్ఘకాలంగా ఆయన ఆయాసం, దగ్గుతో బాధపడుతున్నారు. తన స్వగృహం నుంచి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగొచ్చిన కొద్ది సేపటికే స్పృహ తప్పి పడిపోయారు. అయితే, మొదట నిద్రపోతున్నాడని భావించిన ఆయన భార్య.. తర్వాత ఎంతసేపటికీ లేవకపోవడంతో ఇరుగుపొరుగువారిని పిలవగా వారు వచ్చి చనిపోయినట్లు నిర్ధారించారు.
ఈరన్న ఆలూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండుసార్లు(1978, 1985) టీడీపీ తరఫున (1994) ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1987లో జిల్లాపరిషత్ చైర్మన్‌గా గెలుపొంది 1992 వరకు పనిచేశారు. తిరిగి 1999 ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2007లో కాంగ్రెస్‌లోకి వచ్చి ఆలూరు మండలం జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందారు. అయితే ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈయన వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు.
చంద్రబాబు సంతాపం: మసాల ఈరన్న మృతికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ ైచైర్మన్‌గా ప్రజాసేవలో అంకితమయ్యారని కొనియాడారు. మసాల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.