భద్రాచలం, న్యూస్‌లైన్: ప్రజాబలం లేని కొన్ని రాజకీయపార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి లబ్ధిపొందాలనే వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీలు ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. భద్రాచలం అసెంబ్లీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, టీడీపీలు దొడ్డిదారినైనా విజయం సాధిస్తే చాలనే రీతిలో డబ్బు వెదజల్లేందుకు సిద్ధమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఆయా పార్టీల అధిష్టానం నుంచి వచ్చిన డబ్బులను ఎవరు పంచాలనే దానిపై ఎడతెగని చర్చ నడుస్తున్నట్లు సమాచారం.
ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీల్లో కుమ్ములాటలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికలు మొదలు ఇప్పటి వరకు తెలుగు తమ్ముళ్లు పలుమార్లు వీధికెక్కారు. ఇందుకు తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా కాంగ్రెస్ నాయకులు ఐటీసీ గెస్ట్‌హస్‌ను వేదికగా చేసుకొని తన్నుకున్నారు. నోట్ల కట్టలు ఎవరు పంచాలనే విషయంలోనే ఇరుపార్టీల్లో గందరగోళం నెలకొన్నట్లు సమాచారం. కేంద్రమంత్రి బలరామ్‌నాయక్ తరఫున భద్రాచలానికి చెందిన బోగాల శ్రీనివాసరెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తుండటంతో ఇది జీర్ణించుకోలేని కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కావాలనే తగువులు పెడుతున్నారనే విమర్శ ఉంది.
జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో కేంద్రమంత్రి బలరామ్‌నాయక్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసమని రూ.10 లక్షలు పంపించగా, ఆయన ఆనుచరుడిగా వ్యహరిస్తున్న ఓ వ్యక్తి వాటిని పంచకుండా నొక్కేసినట్లు ప్రచారం జరిగింది. సదరు నాయకునిపై మిగతా కాంగ్రెస్ నాయకులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఇచ్చిన డబ్బులను కాజేసిన వ్యక్తికే మళ్లీ పగ్గాలు అప్పగించడమేంటని ఇక్కడి నాయకులు కేంద్రమంత్రిపై గుర్రుగా ఉన్నారు. డబ్బు పంపకాలపై చొక్కాలు చింపుకుంటూ కొట్టుకుంటున్న సదరునాయకులు గెలిచి ఏమాత్రం ప్రజాసేవచేస్తారో అనుమానమేనని పలువురు విమర్శిస్తున్నారు.
టీడీపీ అభ్యర్థిపై అసంతృప్తి..
నిన్న మొన్నటి వరకు నియోజకవర్గంలో కనిపించని టీడీపీ అభ్యర్థిని ఫణీశ్వరమ్మ అధినేత వద్ద టిక్కెట్టు ఖరారు చేసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చారు. ఒకవేళ ఆమెను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలను అంటిపెట్టుకుని ఉంటుందో; లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలతో సంబంధం లేకుండా పార్టీ నాయకులు, బడా వ్యాపారులను ప్రసన్నం చేసుకుంటే సరిపోతుందా? అనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలప్పుడు బంధువులాగా రావడం, ఆ తర్వాత హైదరాబాద్‌కే పరిమితమయ్యే అభ్యర్థులు మాకొద్దని ఆ పార్టీ కార్యకర్తలే అంటుండటం గమనార్హం.
ఆ రెండు పార్టీలకు గెలుపు ప్రశ్నార్థకమేనా..?
ఈ సారి భద్రాచలం అసెంబ్లీ స్థానంలో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుతో సీపీఎం బరిలో నిలిచింది. ఈ రెండు పార్టీలకు నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది. గత పంచాయతీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు వచ్చిన సీట్ల సంఖ్యను పరిశీలిస్తే ప్రజాబలం ఈ పార్టీలకు ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో మొత్తం 117 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో వైఎస్‌ఆర్‌సీపీ 29, సీపీఎం 28 పంచాయతీలను గెలుచుకుంది. టీడీపీ 24 పంచాయతీలు, అధికార కాంగ్రెస్ కేవలం 12 స్థానాలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సీపీఐ 13 పంచాయతీల్లో గెలుపొందినా ఆ పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఎంతమేరకు సహకరిస్తుందనేది ప్రశ్నార్థకమే అంటున్నారు. మొత్తంగా 57 పంచాయతీలను దక్కించుకుని బలంగా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం కూటమిదే ఈ ఎన్నికల్లోనూ విజయమని విశ్లేషకులు అంటున్నారు.
నోటుతో గెలుద్దాం..!
Published Thu, Apr 17 2014 3:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement