ఖమ్మం టీడీపీలో ‘డబ్బుల’ లొల్లి
ఖమ్మం: జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త లొల్లి మొదలైంది. ఇన్నాళ్లూ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల వర్గాలుగా విడిపోయి అంతర్గంతగా కుమ్ములాడుకున్న తెలుగు తమ్ముళ్లు అందులోభాగంగానే ఇప్పుడు ‘ఆర్థిక’ పోరాటానికి తెరలేపారు. నామాకే మళ్లీ ఖమ్మం ఎంపీ టికెట్ ఖరారు కానున్న నేపథ్యంలో.. ఆ పార్లమెంటు పరిధిలోనికి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయన ఆర్థికసాయం చేయాల్సిందేనని ఎమ్మెల్యే ఆశావాహులు పట్టుపడుతున్నారు. అయితే, దీనికి నామా నాగేశ్వరరావు మాత్రం అంగీకరించడం లేదని పార్టీవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆర్థిక సర్దుబాటుపై తుమ్మల, నామా వర్గీయులు టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఫిర్యాదులు చేసుకున్నట్టు సమాచారం.
సత్తుపల్లిలో.. ఆర్థిక పొరపొచ్చాలు
తాజాగా సత్తుపల్లి నగర పంచాయతీలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఇరువర్గాల మధ్య ఆర్థిక పొరపొచ్చా లు వచ్చాయి. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సండ్ర వెంకటవీరయ్య (తుమ్మల వర్గం) మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వశక్తులు ఒడ్డి అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు.
అయితే, ఖమ్మం ఎంపీగా ఉన్న నామా కూడా ఈ ఎన్నికలలో సత్తుపల్లి మున్సిపాలిటీకి ఆర్థిక సాయం చేస్తారని ఎమ్మెల్యేతోపాటు మున్సిపల్ అభ్యర్థులు, స్థానిక నాయకత్వం ఆశించింది. కానీ నామా మాత్రం డబ్బులు పంపలేదని సమాచారం. చివరి నిమిషంలో కొంత డబ్బు పంపినా.. తాము అడిగినంత పంపలేదన్న కారణంతో ఆ డబ్బును తిరిగి పంపించి వేశారని, అప్పటికప్పుడు స్థానిక నాయకత్వం చందాలు వేసుకుని తగినంత సొమ్ము సమకూర్చుకుందని సత్తుపల్లిలో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు వద్ద ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ నామాపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
నగదు పంపిణీలోనూ గ్రూపు రాజకీయం
ఖమ్మం జిల్లా టీడీపీలో ఉన్న వర్గపోరు కారణంగా ఈసారి ఆర్థికసాయం కూడా గ్రూపు రాజకీయాలపైనే ఆధారపడి ఉంటుం దని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నామా, తుమ్మల ఇద్దరూ ఒకరి ఓటమి కోసం మరొకరు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని, ఈ పరిస్థితుల్లో ఇద్దరికీ అనుచరులుగా ఉన్న వారికి ఏ గ్రూపునకు ఆ గ్రూపే ఆర్థిక సాయం చేసుకుంటారని అంటున్నారు. ఖమ్మం అసెంబ్లీ పరిధిలోనికి వచ్చే ఏడుస్థానాల్లో పాలేరు, సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో తుమ్మల వర్గం అభ్యర్థులు బరిలోఉండే అవకాశముంది.
ఈ పరిస్థితుల్లో ఆ ముగ్గురికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్థిక సాయం చేయకూడదని, చివర్లో మొక్కుబడిగా కొన్నినిధులు పంపితే సరిపోతుందనే భావనలో నామా వర్గీయులున్నట్టు సమాచా రం. దీన్ని తుమ్మల వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఖమ్మం ఎంపీగా గెలవాలంటే అన్ని నియోజకవర్గాల ఓట్లు అవసరమని, అలాంటప్పుడు తమను పక్కన ఎలా పెడతారని వారంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా టీడీపీలో మొదలైన ఈ డబ్బుల లొల్లి ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.