
జోరుగా ‘ఫ్యాన్’ గాలి!
ఎన్నికలు ఏవైనా సరే ప్రజాతీర్పు ఏకపక్షమేనని మరోమారు రుజువు కానుంది.
సాక్షి ప్రతినిధి, కడప:ఎన్నికలు ఏవైనా సరే ప్రజాతీర్పు ఏకపక్షమేనని మరోమారు రుజువు కానుంది. జిల్లాలో వైఎస్ కుటుంబానికే అండగా నిలవనున్నామని ప్రజానీకం మున్సిపోల్స్‌లో తేల్చి చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆదివారం ప్రశాంతంగా పురపోరు ముగిసింది. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని ప్రజానీకం రూఢీ చేశారు. కడప కార్పొరేషన్‌తోబాటు, 7 మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేయనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా అంటేనే గుర్తుకు వచ్చేది వైఎస్ రాజశేఖరరెడ్డి. జిల్లా పట్ల ఆయన కూడా అంతే మమకారం చూపించారు.
2004-09 కాలంలో కడప జిల్లాకు మహర్దశ లభించింది. అన్ని రంగాల్లో జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా దూసుకెళ్లింది. మరింత అభివృద్ధి చెందుతుందన్న దశలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి అర్ధంతరంగా హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందారు. అప్పటి నుంచి తండ్రిలేని బిడ్డలా జిల్లా కొట్టుమిట్టాడుతోంది. అవకాశం వస్తే అభివృద్ధి ఎలా చేయవచ్చో రుజువు చేశారు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆ కృతజ్ఞతగా జిల్లా వాసులు మూకుమ్మడిగా వైఎస్ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఎన్నికలు ఏవైనా, ఎప్పుడు నిర్వహించినా తమ ధ్యేయం వైఎస్సార్‌సీపీని గెలిపించడమేనని రుజువు చేస్తూ వచ్చారు.
అదే పరంపరను మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో ఆ పార్టీ ‘ఫ్యాన్’ స్పీడు ముందు తెలుగుదేశం పారీ ్ట‘సైకిల్’ చిత్తయినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా పురపోరులో 72.7శాతం పోలింగ్ నమోదైంది. కడప కార్పొరేషన్‌లో 62.7 శాతం, ప్రొద్దుటూరులో 75.8 శాతం, మైదుకూరులో 76 శాతం, యర్రగుంట్లలో 82 శాతం, రాయచోటిలో 68.6 శాతం, జమ్మలమడుగులో 80.6 శాతం, పులివెందులలో 62.4 శాతం, బద్వేల్‌లో 73.4 శాతం పోలింగ్ జరిగింది. భారీ పోలింగ్ జరగడంతో ఫ్యాన్ గాలికి ఎదురొడ్డినిలవలేని స్థితి టీడీపీకి ఎదురైందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
కడప కార్పొరేషన్ ఎన్నికలు ఏకపక్షమే...
కడప కార్పొరేషన్ ఎన్నికలు వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా నిలవనున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’గా తయారైందని పలువురు పేర్కొంటున్నారు.
టీడీపీ మేయర్ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు అనేక హైడ్రామాలను నడిపిన తెలుగుదేశం నేతలు తర్వాత ఎన్నికలను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మేయర్ అభ్యర్థిగా 7వ డివిజన్‌లో పోటీ చేసిన బాలకృష్ణయాదవ్‌కు సైతం ఎదురుగాలి వీస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ ‘ఫ్యాన్’ ధాటికి తెలుగుదేశం పార్టీ ‘సైకిల్’ కోలుకోలేని స్థితికి చేరుకున్నట్లు తెలుస్తోంది. 50 డివిజన్లున్నా కడప కార్పొరేషన్‌లో టీడీపీ సింగిల్ డిజిట్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
హోరాహోరీ పోరులోనూ వైఎస్సార్‌సీపీ ముందంజ..
జిల్లాలో మైదుకూరు, బద్వేల్ మున్సిపాలిటి పరిధిలో హోరాహోరీ పోరు నడిచింది. బద్వేల్‌లో తన ఆధిపత్యం నిరూపించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ శనివారం అర్ధరాత్రి తర్వాత ఓటుకు రూ.1500, రూ.2వేలు చొప్పున తన అనుచరుల ద్వారా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మైదుకూరు ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి, టీడీపీ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ ధనాస్త్రాన్ని ప్రయోగించారు. అయినా అటు పుట్టా, ఇటు విజయమ్మ ఎత్తుగడలు చిత్తైట్లు విశ్లేషకుల అభిప్రాయం.
పోలింగ్ శాతం పెరగడంతో వారు ఆశించిన ఫలితాలు తలక్రిందులైనట్లు సమాచారం. మైదుకూరు మున్సిపాలిటిలో 76శాతం పోలింగ్ నమోదైంది. అలాగే బద్వేల్‌లో 73.4 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో టీడీపీ ధనాస్త్రం విఫలమైనట్లు తెలుస్తోంది. మాస్ ఓటర్లు అత్యధికంగా పాల్గొనడంతో తెలుగుతమ్ముళ్లు తల గోక్కుంటున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు మున్సిపాలిటీల్లో హోరాహోరీ పోరు నడిచినట్లు భావించినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్వల్ప ఆధిక్యతతోనైనా ఆపార్టీ అభ్యర్థులే విజయఢంకా మోగించనున్నట్లు సమాచారం.