ఓటెత్తారు!
71.09 శాతం పోలింగ్ నమోదు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు ఆదివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 71.09 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా గూడూరులో 84.57 శాతం.. అత్యల్పంగా ఆదోనిలో 57.98 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలాఉండగా నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి అడుగడుగునా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. పోలింగ్ మొదలయ్యే సమయానికి ఎన్నడూ లేనివిధంగా ఓటర్లు బారులుతీరారు.
ఓటింగ్ శాతం పెరుగుతుందని తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికక్కడే ప్రలోభాలకు గురి చేశారు. బలవంతంగా పక్కకు పిలిపించి డబ్బు పంపిణీ చేయడం కనిపించింది. అధికారులు, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వారిపైనా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. 26వ వార్డులో టీడీపీ అభ్యర్థి భర్త ఓటర్ల ఇళ్లకు వెళ్లి పోలింగ్ కేంద్రానికి వస్తే మీ అంతు చూస్తానంటూ బెదిరించినట్లు ఫిర్యాదులు అందాయి. 19, 22, 36వ వార్డుల్లోనూ ఇలాంటి దౌర్జన్యాలకే తెగబడ్డారు. ఆత్మకూరులో టీడీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరులు దొంగ ఓట్లు వేయించారు.
13వ వార్డులో ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వ్యక్తులచే దొంగ ఓట్లు వేయించినట్లు సమాచారం. 10వ వార్డులో దోర్నాల, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లను గుర్తించిన వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం కార్యకర్తలు అక్కడికక్కడ నిలదీశారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో కొందరిని తిప్పిపంపారు. మరికొందరిని పోలీసులకు అప్పగించారు. 18వ వార్డులో కొందరు టీడీపీ కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేస్తూ డబ్బు పంపిణీ చేశారు. 5వ వార్డులో సరైన ఓటర్ల జాబితాను పీఓకు ఇవ్వకపోవడంతో ప్రారంభంలో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత తప్పును సరిదిద్దారు.
మూడో పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. డోన్‌లో మున్సిపల్ అధికారులు ఓటరు స్లిప్పులు పంపిణీ చేయకపోవడంతో వేలాది మంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఓటింగ్ శాతం తగ్గడంతో కమిషనర్ క్రిష్ణమూర్తి పట్టణంలో మైక్‌లో ప్రచారం చేయించారు. స్లిప్పులు లేకపోయినా ఓటు వేయొచ్చని చెప్పడంతో ఓటింగ్ శాతం కాస్త మెరుగైంది. ఆదోనిలోని 28వ వార్డులో టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేసేందుకు యత్నించారు. పెద్దహరివాణం గ్రామస్తులు పలువురికి ఆదోని మున్సిపాలిటీలో ఓటర్లుగా నమోదు చేయించారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల రాకతో గొడవ సద్దుమణిగింది.
34వ వార్డులో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కుయ్యాయి. 21, 29వ వార్డుల్లో కాంగ్రెస్ వర్గీయులు టీడీపీకి అనుకూలంగా ఓటేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలోని 29వ వార్డులో ఈవీఎంలు గంట పాటు మొరాయించాయి. ఎండాకాలం కావడంతో ఉదయం 7 గంటల సమయానికి పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిక్కిరిశాయి. ఆ తర్వాత 10 గంటల సమయానికే కేంద్రాలన్నీ బోసిపోయాయి. తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల్లో అత్యధికంగా మహిళలే ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.