'గుజరాత్ వస్తే కొడుకులా చూసుకుంటా'
బెంగళూరు/చిక్కబళ్లాపుర: తాను ప్రధాని అయిన తరువాత మీరు కర్ణాటకలో ఉండలేకపోతే గుజరాత్ వస్తే తాను కొడుకులా చూసుకుంటానని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడను బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానించారు. బీజేపీ తరఫున ప్రచారంలో భాగంగా చిక్కబళ్లాపూర్, చిక్కమంగళూరు, హావేరిల్లో ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో ఆయన ప్రసంగించారు. మోడీ ప్రధాని అయితే తాను రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని దేవేగౌడ చేసిన వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. ''దేవేగౌడ జీ, రాజకీయాల్లో మీరు కురువద్ధులు. దేశ ప్రధానిగా పనిచేసిన అనుభవం మీకుంది. నేను మీ కుమారుడి లాంటివాడిని. మీకు మాట ఇస్తున్నాను, నేను దేశ ప్రధాని అయిన తరువాత మీరు కనుక కర్ణాటకలో ఉండలేక పోతే గుజరాత్‌కు వచ్చేయండి. అక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయిస్తాను. అంతేకాకుండా మీరు అంగీకరిస్తే మీకు ఓ కొడుకులా సేవలు చేయడానికి అక్కడ నేను సిద్ధంగా ఉంటాను'' అని మోడీ చెప్పారు.
కేంద్రమంత్రి, చిక్కబళ్లాపుర కాంగ్రెస్ అభ్యర్థి వీరప్పమొయిలీని తీవ్రంగా విమర్శించారు. 2009 నుండి చిక్కబళ్లాపుర ప్రాంతానికి మొయిలీ ఏమీ చేయలేక పోయారన్నారు. ఈ ప్రాంత వాసులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని మొయిలీ నెరవేర్చలేక పోయారని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తానని అప్పట్లో భువనేశ్వరి మాతపై ప్రమాణం చేసి మొయిలీ గెలిచిన తర్వాత ఆ ప్రమాణాన్ని పక్కన పెట్టేశారన్నారు. దేశంలోని నదులను అనుసంధానం చేయాలని అటల్ బిహారి వాజ్‌పేయి కలలు కన్నారని, ఆ కలను సాకారం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో యువత ఉపాధి అవకాశాల కోసం జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాము అధికారంలోకి వస్తే అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు.