ప్రగతి బాధ్యత నాదే
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : రైతులు, గల్ఫ్ బాధితులు నిజామాబాద్ జిల్లాలో నిర్లక్ష్యానికి గురయ్యాని బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నా రు. ఈ ప్రాంతంలో పసుపు పండించే రైతు లు తీవ్ర నష్టాల పాలవుతున్నా పట్టించుకునే వారు లేరన్నారు. పసుపుబోర్డును ఏర్పాటు చేయాల్సి ఉండగా గత పాలకులు దీనిని విస్మరించారని అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో బీజేపీ నిర్వహించిన భారత్ విజయయాత్ర బహిరంగసభలో ఆయన ప్రసంగిం చారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని, ఈ విషయమై తాను ఎంతో బాధ్యతను తీసుకుంటానని అన్నారు.
తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగించడానికే తాను ఈ ప్రాంతంలో పర్య టిస్తున్నానని స్పష్టం చేశారు. ఈసారి ప్రజలు తప్పుడు మాటలకు ఓటువేయవద్దని, దేశ భవిష్యత్తును కాపాడే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వామే పసిపాపలా కాపాడుతుందని హామీ ఇచ్చారు.
వారికి పరాజయం తప్పదు
తల్లీ కొడుకుల పాలనలలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల పట్ల ఉదాసీనంగా వ్యవహరించినందున పాలకులకు ఈ ఎన్నికల్లో ఘోరపరాజయం తప్పదన్నారు. ఒకే కుటుంబంనుంచి నలుగురు ఎన్నికల బరిలో ఉం డడం ఎంతవరకు సమంజసమని టీఆర్‌ఎస్‌ను పరోక్షంగా విమర్శిం చారు. తెలంగాణలో సత్తా ఉన్న మహిళలు, యువకులు లేరా అని ప్రశ్నించారు. అటువంటి కుటుంబం చేతుల్లోకి అధికారం ఇస్తే తెలంగాణ బతుకులు అంధకారంగానే మిగిలిపోతాయన్నారు. కేంద్రంతోపాటు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల చేతుల్లో లడ్డూ ఉన్నట్లేనని అన్నారు. తెలంగాణ నుంచి లక్షలాది మంది యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్నారని, వారి కుటుంబాలు తీరని క్షోభకు గురవుతున్నాయని అన్నారు.
తాము అధికారంలోకి రాగానే గల్ఫ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇక్కడే ఉపా ది, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో మూడులక్షల మంది తెలంగాణవాసులు ఉన్నారని వారిని ఏ విధంగా చూచుకుంటున్నామో ఇక్కడ అలాగే చూసుకుంటామన్నారు. గత ప్రభుత్వాలు గల్ఫ్ బాధితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు అభాగ్యులుగా మిగిలిపోయారన్నారు. తల్లీకొడుకుల పాలనకు స్వస్తిచెప్పి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తామిచ్చామని అంటున్న కాంగ్రెస్ మాటలకు విలువలేదన్నారు.