వాద్రా సంగతి తేలుస్తాం..
అధికారంలోకొస్తే చట్టప్రకారం చర్యలు
‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇంటర్వ్యూలో మోడీ
ఈసారి కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా కష్టమే
అహ్మదాబాద్: తాము అధికారంలోకి వస్తే.. సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మీద ఆరోపణలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశముందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ విషయం వెల్లడించారు. మీరు అధికారంలోకి వస్తే.. వాద్రా మీద ఆరోపణల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా.. ‘‘కక్ష సాధింపు రాజకీయాలపై నాకు నమ్మకం లేదు. గత పదేళ్లుగా ఆ రాజకీయాలతో నన్ను వేధిస్తున్నారు. అదే సమయంలో.. ఎవరూ చట్టానికి అతీతులు కారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోక తప్పదు’’ అని అన్నారు.
తనను విమర్శించడానికి అవినీతి, బంధుప్రీతి, అసమర్థత వంటి అంశాలేవీ దొరక్కపోవడంతో.. ప్రత్యర్థులు తనను పదవీ వ్యామోహి అని, యుద్ధోన్మాది అని నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తమకు వస్తుందన్న నమ్మకం ఉందని, అవసరమైన పక్షంలో జయలలిత, మమతా బెనర్జీ, మాయావతిల మద్దతు తీసుకునే అవకాశం లేకపోలేదని మోడీ పరోక్షంగా చెప్పారు. ఈసారి కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా దక్కడం కష్టమేనని, ఆ పార్టీ మనుగడ కోసం పోరాడుతోందని, అపజయాలు భరించలేక ఆ పార్టీ ప్రస్తుతం లౌకికవాదం అనే బంకర్‌లో దాక్కోవడానికి యత్నిస్తోందని విమర్శించారు. గతంలో తాను హిందూ జాతీయవాదినంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. తాను మొదట భారతీయుడినని, దేశభక్తుడినని, అన్నింటికీ మించి హిందూ విశ్వాసినని చెప్పారు.
అదానీలకు, టాటాలకు లాభం చేకూర్చేలా గుజరాత్ ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందన్న ఆరోపణలను మోడీ తోసిపుచ్చారు. ఈ విషయంలో రాహుల్, సోనియా అబద్ధాలాడుతున్నారన్నారు. కాగా, తమ గ్రూపునకు మోడీ ఆయాచిత లబ్ధి చేకూర్చారంటూ పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఖండించారు. మోడీ తమకు ప్రత్యేకంగా ఎలాంటి లబ్ధీ చేకూర్చలేదన్నారు.