బాహుబలుల నుంచి విముక్తి పొందండి! | narendra Modi hits out at Chautala | Sakshi
Sakshi News home page

బాహుబలుల నుంచి విముక్తి పొందండి!

Published Tue, Oct 7 2014 12:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బాహుబలుల నుంచి విముక్తి పొందండి! - Sakshi

బాహుబలుల నుంచి విముక్తి పొందండి!

కురుక్షేత్ర/హిసార్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చౌతాలా కుటుంబ పాలన, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ ఒప్పందాలను ప్రధాని మోదీ లక్ష్యంగా చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌చౌతాలా కుటుంబాన్ని బాహుబలులు(కండలవీరులు)గాఅ భివర్ణిస్తూ.. ‘కుటుంబ రాజకీయాలు రాష్ట్రాన్ని నాశనం చేశాయి. ఈ బాహుబలుల నుంచి విముక్తి లభిస్తేనే హర్యానాలో సామాన్యుడికి సుపరిపాలన, వృద్ధులకు గౌరవం, మహిళలకు రక్షణ లభిస్తాయి’ అని వ్యాఖ్యానించారు. రాబర్ట్ వాద్రా, డీఎల్‌ఎఫ్ కంపెనీల మధ్య జరిగిన భూ విక్రయ ఒప్పందా న్ని హర్యానా ప్రభుత్వం క్రమబద్ధం చేసిందన్న వార్తపై స్పందిస్తూ.. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ‘ఈ ఎన్నికల తరువాత అల్లుడుగారి(వాద్రా) అక్రమ ఒప్పందాలను ్జక్రమబద్ధం చేయడం కుదరదని వారికి(రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం) తెలుసు. అందుకే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే ఆ పని చేసేశారు’ అని అన్నారు.
 
 అక్టోబర్ 15న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా సోమవారం పలు ప్రచార ర్యాలీల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌డీఏ మాజీ భాగస్వామ్య పార్టీ అయిన ఐఎన్‌ఎల్‌డీ నేత ఓంప్రకాశ్ చౌతాలాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  తను, ఓపీ చౌతాలాలు ఉన్న పాత ఫొటోలను ఐఎన్‌ఎల్‌డీ ఉపయోగించుకోవడంపై మోదీ మండిపడ్డారు. ‘తీహార్ జైళ్లో ఉన్న గూండాల సాయం నాకక్కర్లేదు. ఆ తప్పుడు ప్రచారాలను నమ్మకండి’ అన్నారు. ‘అధికారంలోకి ఎవరొచ్చినా.. పాలన మాత్రం ఆ కుటుంబం చేతుల్లోనే. వారు అభివృద్ధి చెందారు కానీ రాష్ట్రం నాశనమైంది.  రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వారు ఒక్క స్థానంలోనూ గెలవకూడదు’ అని చౌతాలా కుటుంబంపై ధ్వజమెత్తారు. వంశపారంపర్య రాజకీయాలకు అంతం పలకాలని, చాయ్ అమ్ముకునేవాడిని ప్రధానినిచేసిన బీజేపీకి మద్దతివ్వాలని కోరారు.
 
 హైఫై, వైఫై, సఫాయి..: ‘60 ఏళ్ల పాలనలో ఏం చేసిందో చెప్పుకోలేని కాంగ్రెస్ పార్టీ 60 రోజుల్లో ఏం చేశారంటూ మమ్మల్ని అడుగుతోంది’ అంటూ కాంగ్రెస్‌ను ఎండగట్టారు. ‘మీ భూముల్ని లాక్కుంది ఎవరో? ఆ భూముల్ని ఎవరికి ఇచ్చారో మీకు తెలుసు’ అంటూ వాద్రా భూ ఒప్పందాలను పరోక్షంగా గుర్తుచేశారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి ఉత్సవాలను పిల్లల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచేం దుకు ఉపయోగించుకుంటామన్నారు. ‘నవంబర్ 14(నెహ్రూ జయంతి) నుంచి నవంబర్ 19(మాజీ ప్రధాని ఇందిర జయంతి) వరకు పాఠశాలల్లో పరిశుభ్రతపైకార్యక్రమాలను చేపడతాం. ఈ తరం హైఫై, వైఫై, సఫాయిలకు చెందినది’ అన్నారు.
 
 తిరుపతిలా.. కురుక్షేత్ర!: కురుక్షేత్ర ప్రాశస్తాన్ని వివరిస్తూ.. అసత్యంపై సత్యం విజయం సాధించిన, మహాభారతం ప్రభవించిన స్థలం ఇదన్నారు. అమెరికా, చైనాల అధ్యక్షులు, జపాన్ ప్రధానికి భగవద్గీతను బహూకరిస్తూ.. ఈ చరిత్రాత్మక ప్రదేశాన్ని ప్రస్తావించానన్నారు. ‘లక్షలాదిగా భక్తులు వైష్ణోదేవి ఆలయానికి, తిరుపతి బాలాజీ ఆలయానికి వెళ్తున్నారు. కురుక్షేతకు కూడా ఆ స్థాయి ప్రాశస్త్యం ఉంది’ అన్నారు. విదేశీ పర్యటనల్లో తాను కురుక్షేత్రకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నానని వ్యాఖ్యానించారు.


 వాద్రా డీల్ సక్రమమే!


 చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్‌ల మధ్య కుదిరిన భూ లావాదేవీకి సంబంధించిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసిందన్న వార్త ప్రస్తుతం హర్యానా రాజకీయాలను, అక్కడి ఎన్నికల ప్రచారాన్ని మరింత వేడెక్కించింది. అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్(ఏసీఓ) నివేదిక ప్రకారం ఆ భూమికి సంబంధించిన మ్యూటేషన్ సక్రమమేనని నిర్ధారిస్తూ గుర్గావ్ డెప్యూటీ కమిషనర్ శేఖర్ విద్యార్థి ఈ సంవత్సరం జూలైలో హర్యానా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement