
'మోడీ ప్రభావం మీడియాలోనే..దేశంలోని ప్రజల్లో లేదు'
సిమ్లా: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలకు కాంగ్రెస్ మరింత పదును పెట్టింది.మోడీ జపం చేస్తున్న బీజేపీపై కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభావం కేవలం మీడియాలోనే కనిపిస్తోందని.. దేశంలోని ప్రజల్లో మాత్రం ఎక్కడా కూడా ఆయన ఊసే లేదని వ్యాఖ్యానించారు. దేశంలోని సగానిగా పైగా రాష్ట్రాల్లో మోడీ ప్రభావం అసలు ఏమాత్రం కనిపించడం లేదన్న విషయాన్ని బీజేపీ అగ్రనేతలు గుర్తించాలని శుక్లా ఎద్దేవా చేశారు. మీడియాల్లోనే ఆయన ప్రచారాల్ని ఎక్కువగా చూపించి ఏదో జరగబోతుందని బీజేపీ నేతల మభ్య పెడుతున్నారన్నారు.
మీడియాలోని మోడీ ప్రచారాలకు కొన్ని కోట్ల రూపాయిలను బీజేపీ ఖర్చు పెడుతుందని తూర్పారబట్టారు. గత యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలే కాంగ్రెస్ ను మరోమారు గద్దెనెక్కిస్తాయని శుక్లా తెలిపారు. తాము చేసిన అభివృద్ధిని చూపే ప్రజలను ఓట్లు వేయమని కోరుతున్నామన్నారు.