సర్వేల పేరుతో జాతీయ చానళ్ల హంగామా | national channels boost chandra babu in the name of surveys | Sakshi
Sakshi News home page

సర్వేల పేరుతో జాతీయ చానళ్ల హంగామా

Published Fri, Apr 4 2014 4:07 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

సర్వేల పేరుతో జాతీయ చానళ్ల హంగామా - Sakshi

సర్వేల పేరుతో జాతీయ చానళ్ల హంగామా

* సీమాంధ్రలో టీడీపీకి 14 సీట్లు వస్తాయన్న ఎన్డీటీవీ సర్వేపై విస్మయం
* టీడీపీ బలాన్ని అతిగా చూపిస్తున్నాయని విమర్శలు
* 2009లోనూ ఇదే తరహా సర్వేలు
* ఏ సర్వే కూడా అసలు ఫలితాల్ని ప్రతిఫలించలేదు
* వాస్తవానికి దగ్గరగా వచ్చింది నీల్సన్ మాత్రమే

 
 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ సర్వేల పేరుతో జాతీయ చానళ్లు చేస్తున్న హంగామాపై విశ్లేషకులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు బలాన్ని ఎక్కువచేసి చూపేలా ఈ సర్వేలు సాగడాన్ని విమర్శిస్తున్నారు. గతంలోనూ ఇలాగే చేసినా ఫలితాలు వేరుగా వచ్చాయని గుర్తుచేస్తున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీకి 13 సీట్లు వస్తాయని ఎన్డీటీవీ, 14-16 సీట్లు వస్తాయని ఇండియా టుడే, 16 సీట్లు వస్తాయని సీఎన్‌ఎన్-ఐబీఎన్ ప్రకటించాయి. కానీ తీరా ఎన్నికల్లో టీడీపీకి దక్కింది ఆరు లోక్‌సభ సీట్లు మాత్రమే. ఎన్‌డీటీవీ చానల్ గురువారం రాత్రి ప్రకటించిన ఫలితాలు కూడా ఇదే తీరుగా ఉండటంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఈ చానల్ హన్సా రీసెర్చ్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన  సర్వేలో సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ 10 లోక్‌సభ స్థానాలు, టీడీపీ, బీజేపీ కూటమికి 14, కాంగ్రెస్ ఒక్క స్థానం దక్కించుకుంటాయని వెల్లడించింది.
 
 అయితే ఇదే సంస్థ గత నెల నిర్వహించిన సర్వేలో సీమాంధ్రలో 45శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీ 15 స్థానాలు కైవసం చేసుకుంటుందని, టీడీపీ తొమ్మిది స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో ఏ రాజకీయ పరిణామాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ ఓట్లు ఏడు శాతం తగ్గుతాయని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజనకు సహకరించిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల టీడీపీకి సీమాంధ్రలో నష్టమేతప్ప లాభముండే ప్రసక్తే లేదన్నది పరిశీలకులు అభిప్రాయం. రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చిన టీడీపీ, పార్లమెంటులో విభజనకు సహకరించిన బీజేపీకి సీమాంధ్ర ప్రజలు ఎలా ఓటేస్తారని ప్రశ్నిస్తున్నారు. సర్వేల పేరుతో మసిపూసి మారేడుకాయ చేసినంత మాత్రాన ప్రజాభిప్రాయం మారదని వారు చెబుతున్నారు.
 
  సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్ మంగళవారం ఇదే తరహా ఫలితాలు వెలువరించినప్పుడు చర్చలో పాల్గొన్న హిందూ రూరల్ ఎఫైర్స్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాధ్, ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్‌బారు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం గుర్తుచేస్తున్నారు. జాతీయ చానళ్లు గతంలోనూ చంద్రబాబు బలాన్ని ఎక్కువ చేసి చూపించాయని, ప్రస్తుతం మళ్లీ అలాంటి ప్రయత్నమే జరుగుతోందని సాయినాధ్ విమర్శించిన విషయం ప్రస్తావిస్తున్నారు. ఈ సర్వేను తాను అంగీకరించలేనని ఆయన తెగేసి చెప్పారు. బీజేపీతో పొత్తు తెలంగాణలో లాభించవచ్చేమోగాని సీమాంధ్రలో టీడీపీకి ఎలాంటి మేలు చేకూరదని విశ్లేషించారు. విభజన విషయంలో బీజేపీకూడా తమను మోసం చేసింది సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీయే విజయం సాధిస్తుందని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీకే విజయావకాశాలు ఎక్కువని ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్‌బారు కూడా అభిప్రాయపడ్డారు. 2009 ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేల్లో స్టార్‌టీవీ-నీల్సన్ సంస్థ నిర్వహించిన సర్వే మాత్రమే వాస్తవాలకు దగ్గరగా ఉందని, మిగతావన్నీ ఆమడదూరంలో నిలిచాయని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
 
 అప్పటి నీల్సన్ సర్వేలో యూపీఏ కూటమికి 257 సీట్లు వస్తాయని చెప్పగా ఎన్నికల ఫలితాల్లో 263 సీట్లు వచ్చాయి. ఇక సీఎన్‌ఎన్-ఐబీఎన్ సర్వే యూపీఏ కూటమికి 215 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పగా, టైమ్స్ ఆఫ్ ఇండియా 201 దగ్గరే ఆపేసిందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వాస్తవాలకు దగ్గరగా వచ్చిన నీల్సన్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీదే విజయమని చెప్పడం గమనార్హం. కాగా తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు చెరో 7 ఎంపీ సీట్లు, టీడీపీకి రెండు సీట్లు, ఇతరులకు ఓ స్థానం వస్తాయని సర్వే పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement