మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(ఎంపీటీసీ) ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి ఘట్టం నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. శుక్రవారం ఉదయం 11గంటల నుంచి ఎన్నికల అధికారులు ఆయా స్థానాలకు దాఖాలైన నామినేషన్లను నిర్దేశించిన ప్రదేశాల్లో పరిశీలించనున్నారు. అన్ని వివరాలు సరిగా ఉంటేనే అభ్యర్థి నామినేషన్‌ను ఆమోదిస్తారు. లేనిపక్షంలో తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలనపై అటు అభ్యర్థులతోపాటు ఇటు ఓటర్లలోనూ ఆసక్తి నెలకొంది. తిరస్కరణపై ఎన్నికల సంఘం రూపొందించిన విధివిధానాలు తెలుసుకుందాం.
నామినేషన్ల పరిశీలనలో రిటర్నింగ్ అధికారికి అన్ని అధికారాలు ఉంటాయి.
ఎన్నికల నియమావళి ప్రకారం వీలైనంత వరకు అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
అభ్యర్థుల సమక్షంలోనే నామినేషన్లను పరిశీలిస్తారు.
నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి, ప్రతిపాదించిన వ్యక్తి, ఏజెంట్, అభ్యర్థికి సమీప బంధువు లేనిపక్షంలో న్యాయసలహాదారుడు పరిశీలనలో పాల్గొనవచ్చు.
నామినేషన్ ఫారమ్‌లో పొందుపరిచిన వివరాలు పరిశీలిస్తారు. తర్వాత అభ్యర్థితోపాటు అతన్ని ప్రతిపాదించిన వ్యక్తి పేర్లు, వారి సంతకాలు, ఓటరు జాబితాలో వారి పేర్లు అన్నీ సరిచూస్తారు.
జాతీయ, రాష్ట్ర పార్టీల గుర్తులపై పోటీచేసే వ్యక్తి బీ -ఫామ్ సమర్పించారా లేదా అన్నది పరిశీలిస్తారు. (నామినేషన్ల ఉపసంహరణ వరకు కూడా బీ-ఫామ్ సమర్పించే వెసులుబాటు ఉంది). బీ-ఫామ్ సమర్పించని నేపథ్యంలో అభ్యర్థి ఎలాంటి నిర్ణయం(స్వతంత్ర అభ్యర్థిగానైనా) తీసుకుంటారనే వివరణ పత్రాన్ని కూడా పరిశీలిస్తారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్ స్థానాల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా పొందిన కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు.
అన్ని నిబంధనలకు లోబడి ఉంటానని ధ్రువీకరించే పత్రాన్ని పరిశీలిస్తారు.
అభ్యర్థి ఆస్తులు, అప్పుల వివరాలు నమోదు చేసి ఉండాలి. తనపై ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేయాలి.
{పచారానికి అయ్యే ఖర్చులను సమర్పిస్తానని ధ్రువీకరణపత్రం అందజేయాలి.
నామినేషన్ దాఖలు సమయంలో రిటర్నింగ్ అధికారి ఇచ్చిన డిపాజిట్ బిల్లును చూపించాలి.
పైవన్నీ సరిగా ఉన్నట్లయితే అభ్యర్థి నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటన చేస్తారు.
నామినేషన్ ఆమోదిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించిన రెండు నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థులు, ఇతర వ్యక్తులు అభ్యంతరాలు, ఆరోపణలు, ఆక్షేపణలు, అభియోగాలు చేసే సమయం ఉంటుంది.
రెండు నిమిషాలు దాటిన తర్వాత ఆమోదించిన నామినేషన్‌పై ఎలాంటి అభ్యంతరాలు, ఆరోపణలు, ఆక్షేపణలు, అభియోగాలు వచ్చినా అనుమతించరు.
అభ్యర్థిపై అభియోగాలు మోపే వారు రాతపూర్వకంగా రిటర్నింగ్ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది.
ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించాలి.
అభియోగాలను పరిశీలించిన తర్వాతే నామినేషన్‌ను ఆమోదిస్తారు.
ఇందుకు సంబంధించి అభ్యర్థులు, ప్రత్యర్థుల నుంచి రిటర్నింగ్ అధికారులు సంతకాలు తీసుకుంటారు.