లోక్సభకు ఎన్నికైన ఏకైక జంట
పాట్నా: బీహార్కు చెందిన పప్పు యాదవ్ దంపతులు లోక్సభలో అడుగుపెట్టనున్నారు. 16వ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన వీరు పార్లమెంట్ దిగువసభలో కొలువుదీరనున్నారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక జంట వీరే కావడం విశేషం. పప్పు యాదవ్ గా ప్రసిద్ధుడైన రాజేష్ రంజన్ ఐదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
మాధేపురా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్ను 56 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. సపాల్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన పప్పు యాదవ్ భార్య రంజీత్ రంజన్... జెడీ(యూ) అభ్యర్థి దిలేశ్వర్ కామైత్పై దాదాపు 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి లోక్సభకు ఎన్నిక కావడం విశేషం. అయితే తమ సిద్ధాంతాలు, దారులు వేరైనా తమ లక్ష్యం ఒకటేనని పప్పు యాదవ్ దంపతులు నవ్వుతూ చెప్పారు.