డాక్టర్లు దెయ్యాలు
ఆర్జేడీ ఎంపీ పప్పుయాదవ్ వ్యాఖ్య
పాట్నా: వైద్యులపై ఆర్జేడీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైద్యుల్లో నిజాయితీగా పనిచేసే 10 నుంచి 15 శాతం మందిని మినహాయిస్తే... మిగిలిన వారందరినీ తలారులు, తాజా మాంసాన్ని తినే దెయ్యాలుగా పేర్కొన్నారు. వారు పూర్తిగా అవినీతిలో మునిగిపోయారని, దళారులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పొట్టలను కోస్తూ డబ్బులు గడిస్తున్నారని మండిపడ్డారు.
వారికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని అక్టోబర్ 13న సహస్ర నుంచి మొదలు పెడుతున్నట్లు ఆదివారమిక్కడ తెలిపారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటుగా వైద్యసేవలు అందించడాన్ని నిషేధించాలన్నారు.రోగుల సంక్షేమం కోసం నూతన నర్సింగ్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పప్పూ యాదవ్ వైద్యులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. వైద్యుల అర్హతల ఆధారంగా వారి ఫీజును రూ.100 నుంచి రూ.300 మధ్య ప్రభుత్వమే నిర్ణయించాలని ఆయన గతంలో డిమాండ్ చేశారు.