ఈసారి ఓటర్లు, పోలీసుల మధ్య ఇదే ప్రధాన వివాదం
హైదరాబాద్: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠ రేకెత్తించిన తొలిదశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. అత్యంత సమస్యాత్మకంగా భావించిన ప్రాంతాలు, మావోయిస్టు ప్రాబల్యం ఉన్న జిల్లాల్లోనూ అవాంఛనీయ ఘటనలు లేకుండానే ఓటింగ్ ఘట్టం పూర్తయింది.అయితే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడానికి పార్కింగ్ వివాదాలే కారణమయ్యాయి. ఓటింగ్ జరిగే రోజు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచి నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. దీన్ని నిర్దేశిస్తూ అధికారులు గీత కూడా గీస్తారు. సాధారణంగా పోలీసులు, పోలింగ్ కేంద్రాలవద్ద ఓటర్ స్లిప్పులు పంచే వివిధ పార్టీల కార్యకర్తల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి. ఈసారి దీనికి భిన్నంగా ఓటర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఓటు వేయడానికి వచ్చిన వారి వాహనాలను నిర్దేశిత వందమీటర్ల గీత లోపలి ప్రాంతంలో పార్కింగ్ చేయడానికి పోలీసులు అంగీకరించలేదు. అలాగని ఓటింగ్‌కు వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలూ కల్పించలేదు. దీనిగురించి ఎన్నికల సంఘం తరఫున ఉండే అధికారులు ముందుగా చెప్పకపోవడం, పోలీసు శాఖ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సొంత వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లను పోలీసులు... ‘గీత’ అవతల పార్కింగ్ చేసుకోమని చెప్తుండటం ఓటర్లను అసహనానికి గురి చేసింది. ఈ అంశం పైనే అనేక చోట్ల వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో ఎదురైన పార్కింగ్ వాగ్వాదాలతో మేల్కొన్న పోలీసులు ఆ తరవాత చాలాచోట్ల ‘గీత’ దగ్గరే సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యక్తిగత వాహనాలను అనుమతించలేదు. వృద్ధులు, వికలాంగుల్ని తీసుకువస్తున్న వాటినే ముందుకు వెళ్లనిచ్చారు.
పార్కింగ్‌తోనే కష్టాలు
Published Thu, May 1 2014 3:41 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement