
బాబోయ్.. వారసులొచ్చారు!
ఒకప్పుడు ప్రచారం అంటే నాయకులు గజగజలాడేవారు ఒక్క ఓటైనా.. అమూల్యమే అన్న విధంగా ప్రతి వ్యక్తినీ చిరునవ్వుతో పలకరిస్తూ సాగే వారు.. నేటికీ కొన్ని పార్టీల అభ్యర్థులు ఇదే అవలంబిస్తున్నారు. ఐదేళ్లపాటు పదవీ పీఠంపై ఎక్కించనున్నవారిని కనీసం ప్రచారంలోనైనా ప్రసన్నం చేసుకొనేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. అయితే ఈ ఏడాది రాజకీయ తెరంగేట్రం చేస్తున్న కొందరి నాయకుల కుమారులు మాత్రం కనీస మర్యాదలకు నీళ్లొదులుతున్నారు.
అసలే వీరి రాకతో అగ్గిమీద గుగ్గిలమవుతున్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ‘సుకుమారుల’ చేష్టలతో విసిగిపోతున్నారు. ఆయా అభ్యర్థులు తమ తండ్రులు చేసిన తప్పిదాలను మరచి మరీ విర్రవీగుతుండటంతో ఓటర్లు కూడా గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి అద్దంకి, సంతనూతలపాడు, కొండపి, గిద్దలూరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం చూపక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అద్దంకి: డిష్యుం.. డిష్యుం..
రణం బలరాంకష్ణమూర్తి టీడీపీలో రాష్ట్రస్థాయి గుర్తింపుతో ఉన్నప్పటికీ.. జిల్లాస్థాయిలో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉందనేది బహిరంగ సత్యం. అందుకనే, పార్టీ అధినేత చంద్రబాబు కూడా బలరాంను వ్యూహాత్మకంగా పక్కనబె ట్టి..ఆయన కుమారుడు వెంకటేష్‌కు సీటిచ్చారట. అయితే గతంలో బలరాంపై ఫ్యాక్షన్ ముద్ర ఉంది. పలు క్రిమినల్ కేసుల్లో కూడా ఇరుక్కున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కరణం వెంకటేష్ తెరపైకి రావడంతో నియోజకవర్గంలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఫ్యాక్షనిజం వస్తుందేమోననేది వారి ఆవేదన. దీనికి అద్దంకిలో ఈ మధ్య జరిగిన ఘర్షణనే ఉదహరిస్తున్నారు. దీంతో తొలిసారి పోటీచేస్తున్న వెంకటేష్‌కు ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత చరిత్ర గమనిస్తే ఎన్నికల్లో గెలిచిన వారికి 2500 నుంచి 5వేల లోపు మాత్రమే మెజార్టీ ఉండేది.
గొట్టిపాటి రవికుమార్ వెలుగులోకి వచ్చాక నియోజకవర్గంలోని ప్రజలు 17వేలకు పైగా ఓట్ల మెజార్టీనిచ్చారు. ఆయన అభివృద్ధిని అంతా స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం రవికుమార్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలో దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరణం వారసత్వ రాజకీయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
దీపముండగానే..
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను కొండపి ఎమ్మెల్యే జీవీ శేషు, ఆయన కుమారుడు రాజ్‌విమల్ తు.చ తప్పకుండా పాటించారు. పదవిని అనుభవించినంత కాలం ప్రతి చిన్నపనికీ కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని, అందినకాడికి పైసాపైసా పోగేశారనే విమర్శలు మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇలా అపఖ్యాతి మూటకట్టుకున్న శేషు ఈ దఫా కాంగ్రెస్ తరఫున తన కుమారుడు గుర్రాల రాజ్‌విమల్‌ను బరిలో దించారు.
వాళ్లు ప్రచారానికి వెళుతున్నా ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే కొండపి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలవీరాంజనేయస్వామి ప్రచారంలో వెనుకబడిపోగా.. వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి జూపూడి ప్రభాకర్‌రావుకు మాత్రం రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.
మమ..
సంతనూతలపాడు కాంగ్రెస్ అభ్యర్థి వేమా శ్రీనివాసరావు కూడా రాజకీయ వారసుడే.. ఆయన మాజీ ఎమ్మెల్యే వేమా ఎల్లయ్య తనయుడు. ఈయనకు ప్రజల మద్దతు కరువైంది. ప్రచారానికి దూరంగా ఉండటమే కాకుండా.. అన్ని సామాజికి వర్గాలను కలుపుకోలేక పోతున్నారు.
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే కందుల నాగార్జునరెడ్డి వారసత్వంతో కాంగ్రెస్ తరఫున ఆ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కందుల గౌతంరెడ్డి పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీల పోరులో.. ఈయనకు డిపాజిట్లైనా వస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.