విశాఖలో పవన్, హైదరాబాద్లో చరణ్... | Pawan Kalyan's Vizag meeting Vs Ram charan's Hyderabad meeting | Sakshi
Sakshi News home page

విశాఖలో పవన్, హైదరాబాద్లో చరణ్...

Published Wed, Mar 26 2014 11:24 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

విశాఖలో పవన్, హైదరాబాద్లో చరణ్... - Sakshi

విశాఖలో పవన్, హైదరాబాద్లో చరణ్...

హైదరాబాద్ : మెగాస్టార్ కుటుంబ కథా చిత్రం ఆసక్తిదాయకంగా కొనసాగుతోంది. మెగా ఫ్యామిలీలో విభేదాలు మరోసారి తెర మీదకు రానున్నాయా అనేది హాట్ న్యూస్ గా మారింది. ఓవైపు పవన్ కల్యాణ్ విశాఖలో అభిమానులతో భేటీ అవుతుంటే...మరోవైపు చిరంజీవి తనయుడు రామ్ చరణ్  తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్నగర్ ఛాంబర్లో  అభిమానులతో సమావేశం అవుతున్నాడు. దాంతో బాబాయి...అబ్బాయిల పోటీ పోటీ సమావేశాలు... ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది.

ఓ వైపు అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రి హోదాతో పాటు ప్రచార కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్.....‘కాంగ్రెస్ హటావ్...దేశ్ బచావ్' నినాదంతో కొత్త పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఓవైపు, మిగతా మెగా ఫ్యామిలీ హీరోలంతా మరోవైపు చీలి పోయారు. పవన్  పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని, తమతో పాటు, మెగా అభిమానులంతా చిరంజీవి వైపే అని రామ్ చరణ్ తో పాటు సోదరుడు నాగబాబు మీడియా ముఖంగా ప్రకటించారు. ఈ పరిణామాలతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానుల మధ్య కూడా చీలిక ఏర్పడిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రాష్ట్ర విభజనలాగా....మెగా అభిమానులు కూడా రెండుగా చీలబోతున్నారా? చరణ్ అభిమానులకు ఏం సందేశం ఇస్తాడనేది సస్పెన్స్గా మారింది.అయితే కొందరు అభిమానులు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. ప్రతి సంవత్సరం అభిమానులు రామ్ చరణ్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పడం, రక్తదానం చేయడం ఆనవాయితీగా వస్తోందని చెప్పుకొస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఈ నెల 27న విశాఖపట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘యూత్ ఫర్ నేషన్, ఫైట్ ఫర్ నేషన్’ అనే నినాదంతో ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా  యువత కోసం పవన్ ప్రత్యేక శ్రద్ధతో కంపోజ్ చేయించిన గీతంతోపాటు జనసేన సిద్ధాంతాలకు సంబంధించి తన స్నేహితుడు సహకారంతో రచించిన ‘ఇజం’ పుస్తకాన్నిఆవిష్కరించనున్నాడు. ఇటీవలే పవన్ గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే.  ఏది ఏమైనా.....పవన్ కల్యాణ్ సభ పెట్టిన రోజు రామ్ చరణ్  అభిమానులతో సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement