రాజకీయ సన్యాసి సర్వేలు చేయించటమా?
నిజామాబాద్ : రాజకీయంగా ఎదుర్కోలేకనే చతికిలపడి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు సర్వేలేందుకని వైఎస్సార్ సీపీ ఎల్లారెడ్డి ఇన్చార్జి పెద్దపట్లోళ్ల సిద్దార్థరెడ్డి విమర్శించారు. లగడపాటి తన ఆస్తులను కాపాడుకునేందుకు తప్పుడు సర్వేలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా, లగడపాటి టీడీపీ అధికారంలోకి వస్తుందని తప్పుడు సర్వేలతో దుష్ర్పచారం చేయడం సిగ్గుచేటన్నారు. లగడపాటి తిక్క ఉన్న లెక్కలేని మనిషి అని విమర్శించారు.
జగన్ను విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్కు లేదన్నారు. సినిమాల్లో బొమ్మలాట ఆడే వ్యక్తి ప్రజల కోసం శ్రమించే వ్యక్తిని విమర్శించడమేంటని సిద్ధార్థరెడ్డి ప్రశ్నించారు. ప్రజారాజ్యం పేరిట పార్టీ స్థాపించిన చిరంజీవి, పవన్ కల్యాణ్ కాంగ్రెస్ కు అమ్ముడు పోయారని ఆరోపించారు.
యువరాజ్యం స్థాపించిన పవన్ యువకులను చైతన్యం చేస్తానని టీడీపీ, బీజేపీలను చైతన్యం చేస్తున్నారన్నారు. ఆయనకు తిక్క, లెక్కలు లేవుగాని అధికార దాహం ఉందన్నారు. జనసేన పేరిట పార్టీ పెట్టిన పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతామన్న భయంతో పార్టీ పెట్టకుండా ఇతరులకు మద్దతు పలుకుతున్నారని అన్నారు.