కొండబాబంటే గుండెల్లో దడే
కాకినాడ, న్యూస్‌లైన్: గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే తత్వం లేని టీడీపీ కాకినాడ సిటీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) వైఖరికి జనం భయభ్రాంతులవుతున్నారు. 2004లో ఆయన నిజ స్వరూపాన్ని చూసిన ఇక్కడి ప్రజలు నాటి సంఘటనలు జ్ఞప్తికి తెచ్చుకుని బెంబేలెత్తిపోతున్నారు. పరాజయాన్ని జీర్ణించుకోలేక ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే జనంపై దాడికి తెగబడిన ఆయన అనుచరుల తీరు ఈ ఎన్నికల సందర్భంలో చర్చనీయాంశమైంది. తన ఓటమికి కారణమయ్యారనే అక్కసుతో అప్పటి ప్రత్యర్థి పార్టీగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలపై కొండబాబు అనుచరులు, అల్లరిమూకలు చెలరేగిపోయి దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. ఇళ్లలో లూటీలకు కూడా తెగబడ్డారు.
ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేయడం, మహిళలను పరుష పదజాలంతో దూషించడం, రక్తం వచ్చేలా కొట్టడం ఇప్పటికీ నగరంలో ప్రతి ఒక్కరి కళ్ల ముందు మెదులుతోంది. కొన్ని ఇళ్లలో బంగారం, నగదు కూడా లూటీ చేసిన సంఘటనలపై అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి. 2004 ఏప్రిల్‌లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అంశంపై 2004 ఏప్రిల్ 27న క్రైం నెంబర్ 62, 63తో కాకినాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.
కామేష్ ఇంటిపై దాడి
అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన చింతా కామేష్ ఇంటిలోకి సుమారు 20 మంది కొండబాబు అనుచరులు చొరబడి దాడులు చేశారు. జగన్నాధపురం గోళీలపేటలోని కామేష్ నివాసానికి వెళ్లిన రౌడీమూకలు కొండబాబును ఓడిస్తారా అంటూ అతనిపై భౌతిక దాడికి దిగారు. కుటుంబ సభ్యులను కూడా గాయపరిచి ఇంటిలోని సామాన్లను చెల్లాచెదురుగా విసిరేశారు.
విషయం తెలుసుకున్న అప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కంపూడి రామ్మోహనరావు, పళ్లంరాజు, ముత్తా గోపాలకృష్ణ, మల్లాడి కృష్ణారావు వంటి నేతలంతా కామేష్ ఇంటికి వెళ్లి అతనికి ధైర్యం చెప్పారు. ఒక్క కామేష్ ఇంటిపైనే కాక ఆ ప్రాంతంలో మత్స్యకార నాయకులు, మాజీ కౌన్సిలర్ తిరుదు వెంకటేశ్వరరావు, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్‌గా ఉన్న రాధాకృష్ణ, లైటింగ్ కృష్ణ, నాగకుమారి... ఇలా పలువురు వనమాడి అనుచరుల వీరంగాన్ని ప్రత్యక్షంగా చవిచూశారు. దుకాణాలు, చిరు వ్యాపారుల పాన్‌షాపులు, వ్యాపార సంస్థలపై కూడా ఈ దాడి కొనసాగింది.
వెన్నాడుతున్న నాటి జ్ఞాపకాలు
కొండబాబు అనుచరుల అరాచకాలు జరిగి పదేళ్లు అయినా మరోసారి అలా చేయరని గ్యారంటీ ఏమిటనే ప్రశ్న స్థానికుల నుంచి విన్పిస్తోంది. ఇళ్లు, వ్యక్తులపై దాడులతోపాటు మహిళలకు సైతం భద్రత లేని పరిస్థితి అక్కడ ఉందని వాపోతున్నారు. బ్రాందీషాపుల నుంచి నెలవారీ మామూళ్లు రాలేదనో, రేట్లు తగ్గించలేదనో రహదారులను దిగ్బంధించడం వంటి చర్యలు మరిచిపోలేకపోతున్నామని వారంటున్నారు.
దాడులతో భీతిల్లాం
కొండబాబు అనుచరులు చేసిన దాడులతో అప్పట్లో చాలా ఆందోళనకు గురయ్యాం. ఒక్కసారే 20 మందికి పైగా ఇంటిపై పడి దాడి చేసి మా కుటుంబ సభ్యులను సైతం గాయపరిచారు. ఇంట్లో సామాన్లను చెల్లాచెదురుగా పడవేసి బీభత్సం సృష్టించారు. ఆ సంఘటన చూసిన స్థానికులు ఇప్పటికీ కొండబాబు పేరుచెబితే హడలెత్తిపోతున్నారు. ఎన్నికల్లో ఆయన మరోసారి పోటీ చేస్తున్నారని తెలుసుకున్న స్థానికులు అలాంటి వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోరాదనే పట్టుదలతో ఉన్నారు.
- చింతా కామేష్, జగన్నాధపురం.