నేతల పెళ్లిళ్ల గోల... ఆపరేల?
సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలో అగ్రనేతల నడుమ మాటల తూటాలు పేలాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు శిఖరస్థాయికి చేరాయి. విమర్శలు, ప్రతివిమర్శలు పతాక శీర్షికలకెక్కాయి. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసేందుకు సైతం నాయకులు వెనుకాడలేదు. అగ్రనాయకులు సైతం ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయడం విస్తుగెల్పుతోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతల వైవాహిక జీవితాలు చర్చనీయాంశంగా మారాయి.
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వైవాహిక జీవితంపై విమర్శలు ఎక్కువగా వినిపించాయి. కట్టుకున్న భార్యనే ఆదరించని మోడీ దేశానికి ఏం చేస్తారని ప్రత్యర్థులు ఘాటుగా ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలపై మోడీ ఎక్కడా స్పందించలేదు. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, రాజ్యసభ టీవీ వ్యాఖ్యాత అమృతా రాయ్ ప్రేమాయణం కూడా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. డిగ్గీ రాజా-అమృత ప్రేమ వ్యవహారాన్ని ప్రత్యర్థి పార్టీలు అస్త్రంగా మలుచుకున్నాయి. దీంతో దిగ్విజయ్ ఎదురుదాడికి దిగారు. మోడీలా 30 ఏళ్లు పెళ్లి సంబంధాన్ని తాను దాచలేదంటూ బదులిచ్చారు.
కాగా చిరకాల ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్పై బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యక్తిగత విమర్శలు ఎక్కుపెట్టారు. తన రెండో భార్య కోసమే ములాయంసింగ్ యాదవ్ ఆజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ములాయం కుటుంబంలో వివాదం నడుస్తోందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో తన రెండో భార్యను ఆనందపరిచేందుకు, తద్వారా వారి కుమారుడు ప్రతీక్ యాదవ్‌కు మార్గం సుగమం చేసేందుకు ములాయం అజంగఢ్ స్థానం నుంచి పోటీకి దిగారని మాయావతి తీవ్ర ఆరోపణ చేశారు.
జాతీయ స్థాయి నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. వాహిక జీవితాలపై ప్రజావేదికల మీద చర్చ పెట్టడం సమంజసం కాదన్నది ప్రజల అభిప్రాయం. ఇంక ఎందరి నాయకుల వైవాహిక జీవితాలు వీధికెక్కుతాయోనని భయపడుతున్నారు.