సాక్షి, హైదరాబాద్: తమకు గన్‌మెన్‌లు ఇవ్వాలంటూ పలువురు రాజకీయ నేతలు చేస్తున్న ఒత్తిళ్లు.. పోలీసు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు రావడం.. వాటిలో పోటీచేస్తున్న అభ్యర్థులంతా తమకు వైరి పక్ష నుంచి హాని ఉందని, భద్రత కల్పించాలని కోరుతూ అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే జెడ్‌ప్లస్ మొదలుకుని ఎక్స్ కేటగిరి వరకు దాదాపు 800 మంది రాజకీయ ప్రముఖులకు వివిధ విభాగాలు భద్రత కల్పిస్తున్నాయి. ఇందుకోసం అదనపు ఎస్పీ ర్యాంకు అధికారి స్థాయి నుంచి కానిస్టేబుళ్ల వరకు దాదాపు ఆరున్నర వేల మంది పనిచేస్తున్నారు.
ఇక మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిలకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎస్‌ఎస్‌జీ) నుంచి రక్షణ లభిస్తోంది. ఎంపీల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు వారికి ఉన్న ముప్ప తీవ్రతను బట్టి వివిధ కేటగిరిల కింద భద్రత కల్పిస్తున్నారు. ఇలా గన్‌మెన్ సౌకర్యం పొందినవారిలో సర్పంచ్‌లు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ఎన్నికలు రావడంతో ఇప్పటికే సెక్యూరిటీ లేని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమకు గన్‌మెన్‌లు కావాలంటూ పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు నాయకులైతే.. తమ వెంట గన్‌మెన్‌లు ఉండటం ఓ హోదాగా భావించి, తమకున్న ఆర్థిక బలంతో గన్‌మెన్ కోసం తాపత్రయపడుతున్నారని భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కావడంతో దీనిపై ఎంత పెద్దస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా, ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని తెలిసింది. కొందరి పిటిషన్లను పరిశీలించినా, వారికి సెక్యూరిటీ నిజంగా అవసరమా లేదా అనేది విచారించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటున్నారు. ఓవైపు ఎన్నికల బందోబస్తుకు, మరోవైపు ప్రచారానికి వస్తున్న వీవీఐపీలకు భద్రత కల్పించడానికే సిబ్బంది సరిపోక సతమతమవుతున్నామని పోలీసు అధికారి తెలిపారు.