
ముస్లింలకు పెద్దపీట
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ముస్లింలకు పెద్దపీట వేస్తారని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, విశాఖ లోక్సభ అభ్యర్థి విజయమ్మ హామీ ఇచ్చారు.
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ముస్లింలకు పెద్దపీట వేస్తారని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, విశాఖ లోక్సభ అభ్యర్థి విజయమ్మ హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీ నేతలతో విజయమ్మ ఈరోజు ఇక్కడ సమావేశమయ్యారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో జగన్ ముందుంటారని విజయమ్మ చెప్పారు. సంక్షేమం కోసం వైఎస్ఆర్ సీపీని గెలిపించమని ఆమె కోరారు.
విశాఖ వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికసంఘాల నేతలతో కూడా విజయమ్మ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి షిప్‌యార్డ్, జీవీఎంసీ, ఆంధ్రా యూనివర్సీటీ, హెచ్పిసిఎల్, ఆర్టీసి సహా వివిధ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు హాజరయ్యారు.
అంతకు ముందు ఎన్నికల సభలో విజయమ్మ మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్‌ఆర్‌కు విశాఖ అంటే ఎంతో మమకారం అని చెప్పారు. హైదరాబాద్‌కు ధీటుగా విశాఖను అభివృద్ధి చేయాలని వైఎస్‌ఆర్ కలలు కన్నారన్నారు. విశాఖ వాసులకు, తనకు ఏ అనుబంధం ఉందో తెలియదని, ఆ అనుబంధం తనను విశాఖకు తీసుకొచ్చేలా చేసిందని చెప్పారు. జగన్ నాయకత్వంలో వైఎస్‌ఆర్ కలలను సాకారం చేసుకుందామని, వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించుకుందామని విజయమ్మ పిలుపు ఇచ్చారు.