'మీరు కాదు... మేమే మీకు రుణపడ్డాం'
విశాఖ : వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్ర ప్రజలు తమ కుటుంబానికి అండగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ జనభేరి కార్యక్రమాన్ని వైఎస్ విజయమ్మ, షర్మిల సోమవారం విశాఖలో నిర్వహించారు. ఈ సందర్భంగా మధురవాడ సభలో షర్మిల మాట్లాడుతూ 'మీరు కాదు... మేమే మీకు రుణపడి ఉన్నాం' అన్నారు.రాజశేఖరరెడ్డి కుటుంబం మీకు రుణపడి ఉందని... ఇప్పుడు మీ రుణం తీర్చుకోవడానికి తమకు సమయం వచ్చిందన్నారు.
సోనియాగాంధీ అన్యాయంగా కక్షగట్టి జగనన్నను జైల్లో పెట్టారని షర్మిల అన్నారు. రాజశేఖరరెడ్డి పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్ను సీఎంను చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిని చేశారని, ఆ రుణం తీర్చుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని షర్మిల కోరారు. చరిత్రలో మర్చిపోని విధంగా వైఎస్ విజయమ్మను గెలిపించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు ఇప్పుడు రుణమాఫీలు చేస్తానంటూ మాయమాటలు చెప్తున్నారన్నారు. 25 ఏళ్లుగా బాబు కుప్పం ప్రజలు గెలిపించుకున్నా... కుప్పంను ఇంకా పంచాయతీగానే ఉంచారన్నారు. అలాంటి చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్లా ఎలా చేస్తాడని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్నే చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని... పదవి కోసం పిల్లనిచ్చిన మామపై చెప్పులు వేయించాడన్నారు.