సచిన్ రిటైరయ్యాడు కానీ..
1989.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన సంవత్సరం. మొదటి యుద్ధమే బలమైన ప్రత్యర్థి పాకిస్థాన్‌తో. అయినా, ఇమ్రాన్‌ఖాన్, వసీం అక్రమ్‌లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని ఔరా అనిపించాడు. అప్పటి నుంచి ఇటీవల రిటైరయ్యేవరకు అప్రతిహతంగా ఆయన ఇన్సింగ్స్ కొనసాగింది.
1989.. అదే సంవత్సరం మధ్యప్రదేశ్‌లో ఒక మహిళ లోక్‌సభ ఎన్నికల బరిలోకి మొదటిసారి దిగారు. ప్రత్యర్థి సీనియర్ కాంగ్రెస్ నేత. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ చంద్ సేథీ. అయినా వెరవక విజయం సాధించారు ఆ మహిళ.అప్పటినుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు వరుసగా ఏడుసార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆమె ఇన్నింగ్స్ కూడా అప్రతిహతంగానే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇండోర్ స్థానం నుంచి బరిలో ఉన్న ఆ మహిళ స్థానిక ప్రజలు ‘తాయి’ అని పిలుచుకునే సుమిత్రా మహాజన్(70). వరుసగా ఎనిమిదో సారి విజయం సాధించి రికార్డు సృష్టిస్తానంటున్నారు సుమిత్రా మహాజన్.
మోడీ ప్రభావం, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ల పనితీరుతో తన శ్రమ సగం తగ్గిందని.. వారిద్దరి సహకారంతో సునాయాసంగా గెలుస్తానంటున్నారు. ప్రచారానికెళ్తే.. ఈజీగా గెలుస్తారు కదా ఎందుకు అనవసరంగా ప్రచారం చేస్తూ కష్టపడుతున్నారని స్థానిక ప్రజలు ఆమెను అడుగుతున్నారట. గత ఎన్నికల్లో సుమిత్ర చేతిలో ఓడిపోయిన సత్యనారాయణ పటేల్ కాంగ్రెస్ తరఫున, అనిల్ త్రివేదీ ఆప్ తరఫున ఆమెకు ప్రత్యర్ధులుగా ఉన్నారు. ఏప్రిల్ 24న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.