సైకిలెక్కిసిన మాజీమంత్రి శైలజానాథ్....
అనంతపురం : అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరపున మాజీమంత్రి శైలజానాథ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన నామినేషన్సై మాజీమంత్రి పామిడి శమంతకమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. తన కుమార్తె యామిని బాలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారని, పార్టీలో సభ్యత్వం లేని మీరు నామినేషన్ ఎలా వేస్తారని శైలజానాథ్ను శమంతకమణి నిలదీశారు.
కాగా రెండు రోజుల క్రితం శైలజానాథ్ కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సీమాంధ్ర కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరుల అడిగిన ప్రశ్నకు శైలజానాథ్ సమాధానమిస్తూ పార్టీ మారి పోటీ చేయాల్సిన దుస్థితి తనకు లేదని కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తానని వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం సీన్ మారింది. కాంగ్రెస్ తరపున పోటీకి శైలజానాథ్ విముఖత చూపుతు టీడీపీ తరపున నామినేషన్ వేశారు.