శశి థరూర్ను వదలని సునంద భూతం!!
కేంద్ర మంత్రి శశి థరూర్ను ఆయన భార్య సునందా పుష్కర్ భూతం వదులుతున్నట్లు లేదు. ఆమె మరణం విషయంలో వామపక్షాల నాయకులు, బీజేపీ మహిళా మోర్చా నాయకులు తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ శశి థరూర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారికి తన ఫిర్యాదు అందజేశారు. థరూర్ తిరువనంతపురం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ టీవీ కార్యక్రమంలో తనను 'పుష్కర్ హంతకుడు' అంటూ సీపీఐ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సంబోధించారని ఆయన ఆరోపించారు.
జనవరి 17న సునందా పుష్కర్ అనుమానాస్పద పరిస్థితుల్లో ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్లోమరణించిన విషయం తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా తప్పని, అవి తన ప్రతిష్ఠకు భంగం కలిగించడంతో పాటు ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘిస్తున్నాయని ఆయన అన్నారు. దాదాపు ప్రతి టీవీ చానల్లోనూ సీపీఎం సభ్యుడు ఎం.విజయకుమార్ కూడా తన ప్రతిష్ఠను మంటగలిపారని థరూర్ చెప్పారు. 'మహిళలపై హింస' అనే అంశంలో తనకు డాక్టరేట్ ఉన్నట్లు ఆయన చెప్పారన్నారు. ఇక బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు తన బొమ్మకు చెప్పుల దండలు వేసి, దాన్ని మహిళలతో కొట్టించారని వాపోయారు. ఇవన్నీ తన వ్యక్తిత్వాన్ని హననం చేయడమేనంటూ భోరుమన్నారు. అందువల్ల వీళ్లందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.