సమాజం మార్పుకోరుతోంది | Society should be changed, says dil raju | Sakshi
Sakshi News home page

సమాజం మార్పుకోరుతోంది

Published Sun, Apr 6 2014 1:31 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

సమాజం మార్పుకోరుతోంది - Sakshi

సమాజం మార్పుకోరుతోంది

సమాజం మార్పు కోరుతోంది... అయితే అది ఒక్కసారిగా రాదు. అభివృద్ధిపై దృష్టి ఉన్న నేతనే ఎన్నుకోవాలి...’అంటున్నారు.. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు.

బొల్లోజు రవి-ఎలక్షన్ సెల్

‘సమాజం మార్పు కోరుతోంది... అయితే అది ఒక్కసారిగా రాదు. అభివృద్ధిపై దృష్టి ఉన్న నేతనే ఎన్నుకోవాలి...’అంటున్నారు.. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు. సమాజం డబ్బుతోనే నడుస్తోందని, ఇక్కడ భావోద్వేగాలకు స్థానం లేదని పవన్ కళ్యాణ్ ‘ఇజం’ ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులంతా ఒక్కటేనని, కొత్త ఆలోచనలకు స్వాగతం పలుకుతున్నారని అభిప్రాయపడుతున్నారు. స్కిల్ ఉంటేనే సినీ రంగంలో రాణింపు ఉంటుందని, తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు కమిటీ వేయాలని సూచిస్తున్నారు... నవ తెలంగాణపై ఆయన  అంతరంగ ఆవిష్కరణ..
 
 
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విజన్ ఉన్న నాయకత్వం, అవినీతి జోలికి వెళ్లని నేతలు అవసరం. కేంద్రం నుంచి నిధులు ఎలా తెచ్చుకోవాలో ఆలోచించగలగాలి. పెట్టుబడులను ఎలా ఆకర్షించాలో...పరిశ్రమలు, ఐటీ, నీటిపారుదల ప్రాజెక్టులు, సినీ పరిశ్రమ..ఇలా వివిధ రంగాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలియాలి. ఇదంతా ఓటర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇపుడు ఓటరు 500-1000 రూపాయలు తీసుకొని ఓటేస్తున్నాడు. వారు మారాలి. 2009లో మా ఊరు నిజామాబాద్ మండలం నర్సింగ్‌పల్లిలో అభ్యర్థులను పిలిచి మాకు ఏం చేస్తారని అడిగాం. బ్యానర్లు, వాల్‌పోస్టర్లు, ఏజెంట్ల అవసరం లేకుండా, పోలీసులు రాకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాం. స్వచ్ఛందంగానే ఓటేయమని చెప్పాం. 86 శాతం ఓటింగ్ జరిగింది. సర్పంచి ఎన్నికల్లోనూ మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవంగానే ఎన్నుకున్నాం. ఇలా తయారుకావాలి. సమాజం డబ్బు మీదనే నడుస్తోంది. భావోద్వేగాలు అనేవి లేవు. 1994 తర్వాత రాజకీయాల్లో అవినీతి పెచ్చుమీరింది. 10-20-50 నోట్లు కనిపించడమే లేదు. 500-1000 నోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. 5-10 కోట్లు ఖర్చు చేయకుండా ఈ రోజు ఎమ్మెల్యేగా  గెలిచి వచ్చే పరిస్థితి లేదు.  
 
 సినీ రంగంలో నిలదొక్కుకున్నాం
 
 దేశంలో మన సినీ పరిశ్రమే రెండో అతిపెద్దది. సినిమాలు తీయడంలో ఒకరకంగా తమిళనాడు, మనం పక్కపక్కనే ఉంటాం. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ 25 ఏళ్లుగా ఆతిథ్యం ఇస్తోంది. సీమాంధ్రకు సినీ పరిశ్రమ తరలి వెళ్లాలని ఎవరో ఒకరిద్దరు ప్రకటనలు చేస్తున్నారు.
 
 దీనివల్ల మనం నష్టపోతాం. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ లేకుంటే నేను నిర్మాతను అయ్యేవాడినా. తెలంగాణ నుంచి దర్శకులు ఎంతో మంది వచ్చారు. ఇప్పుడు 10 మంది వరకు ఉన్నారు. 25 ఏళ్ల క్రితం ఒక్క తెలంగాణ దర్శకుడు లేడు. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం వారు సినీ రంగంలో నిలదొక్కుకుంటున్నారు. సీమాంధ్రకు చెన్నై దగ్గర అవడం వల్ల ఆ ప్రాంతం వారు అక్కడికి తరలివెళ్లారు. అందుకే 90 శాతం మంది అక్కడి నుంచే తెలుగు పరిశ్రమలో ఉన్నారు. సినీ రంగంలో స్కిల్, నాన్ స్కిల్ అనేది ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్, కరుణాకరన్ తమిళనాడు వారు. ప్రకాశ్‌రాజ్ కన్నడవారు. వాళ్లకు స్కిల్ ఉంది కాబట్టి తెలుగులోనూ వారు రాణించారు.  మహేష్‌బాబు, రాజమౌళి వంటి వారిని తయారు చేయగలమా? నాన్‌స్కిల్ అనేది సినీ రంగంలో ఆర్టిస్టులు కాకుండా ఇతరత్రా పనిచేసేవారు. హైదరాబాద్‌కు సినీ పరిశ్రమ తరలి వచ్చిన కొత్తలో నాన్ స్కిల్ వారు తమిళనాడుకు చెందినవారు వారు 60 శాతం, ఏపీ వారు 40 శాతం ఉండేవారు. తర్వాత అది 40, 60గా మారింది.
 
 కొత్తదనం కావాలి
 
 తమిళనాడులో సంప్రదాయ సినిమాలను, కొత్తదనాన్ని ప్రోత్సహిస్తారు. ఇక్కడ ప్రోత్సహించరు. మన వద్ద సంప్రదాయ సినిమాలు తీస్తే నష్టపోతాం. ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై సినిమాలంటూ తీయడం కష్టమే.  ఏదో ఒక ప్రాంతం గురించి ట్రెడిషనల్‌గా తీస్తే చూడరు. ఆర్.నారాయణమూర్తి సినిమాలు తెలంగాణలోనే ఎక్కువగా చూస్తారు. సీమాంధ్రలో పెద్దగా ఆదరించరు. సమాజంలో మార్పు వచ్చింది. ఒకప్పుడు సెంటిమెంటు సినిమాలు ఆడేవి. ఇప్పుడు ఆడటంలేదు. హిందీ సినిమా ఎక్కడకో పోయింది. కొత్త ఆలోచనలతో సినిమాలు తీస్తున్నారు. ప్రపంచంలో వస్తున్న మార్పులను మనం పసిగట్టాలి. ఇలాగే ఉంటామంటే కుదరదు.  ఈ రోజు తెలుగులో ఏడాదికి 150 సినిమాలు తీస్తే 130 ఫట్ అవుతున్నాయి. దీనికి కారణం  స్కిల్ లేకపోవడమే. తెలంగాణ యువతీ యువకులకు సినీ రంగంలో అవకాశాలు పెరగాలంటే ఇక్కడ ఒక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెట్టి శిక్షణ ఇవ్వాలి. అది రాబోయే తెలంగాణ ప్రభుత్వం చేయాలి.
 
 
 పవన్ ‘ఇజం’ సాధ్యమేనా?
 పవన్ కల్యాణ్ ‘ఇజం’ రాశాడు. అయితే అది ఆచరణలో ఏ మేరకు సాధ్యం? ఒక్కడు వచ్చి ఏం సాధిస్తాడు? ఒక్క నెలలో తీసుకొచ్చే మార్పేమి ఉండదు. తెలంగాణ కోసం కేసీఆర్ 13 ఏళ్లు నిర్విరామంగా పోరాడారు. ఉద్యమాన్ని పడిపోకుండా కాపాడారు. రాజకీయ సమీకరణాలు చేశారు. సమాజంలో మార్పు రావాలంటే ఆ విధంగా నిర్విరామంగా పోరాటం చేయాలి. 60 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చింది. అలాంటిది పవన్ చె ప్పేది సాధ్యమా? ఆయనకు కాంగ్రెస్ మీద, చిరంజీవి మీద ఏదో కోపం ఉన్నట్లుంది.
 
 జన  తెలంగాణ
 
 సొంత లాభం వదలాలి...
 ఎందరి త్యాగాల ఫలితంగానో ఏర్పడిన తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవాలంటే అవినీతిలేని, మచ్చలేని నేతలనే ఎన్నుకోవాలి. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి దూరంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు కొంత కాలంపాటు జీతాల పెంపు లాంటి  సొంత ప్రయోజనాలను పక్కన పెట్టాలి. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పని చేయాలి.
 - గుంటోజు సత్యం, భూదాన్ పోచంపల్లి, నల్గొండ జిల్లా
 
 కొత్త ఆలోచనలు కావాలి...
 అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వమూ, పార్టీలూ, మేధావులూ, ఉద్యోగులూ కలిసికట్టుగా పని చేయాలి. రైతుకు ఊతమివ్వాలి. ఉచిత విద్యుత్‌తో పాటు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలి. సాగునీటి పథకాలను చేపట్టాలి. విద్యుత్ కొరత తలెత్తకుండా ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలి. చెరువుల అభివృద్ధికి నిధులివ్వాలి. పారిశ్రామిక ప్రగతికి చర్యలు తీసుకోవాలి. విద్య, వైద్యరంగాలకు జీవం పోయాలి. సొంత లాభం చూసుకోకుండా రాష్ట్ర సాధన కోసం పోరాడినట్టే నవ నిర్మాణంలోనూ అందరూ భాగస్వాములు కావాలి.
 - బి. ప్రేమ్‌లాల్, వినాయక్‌నగర్, నిజామాబాద్
 
 కులవృత్తులకు చేయూత
 తెలంగాణ కోసం ఉద్యమించిన అందరికీ మేలు చేసినపుడే అమరుల త్యాగాలకు అర్థముంటుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన అన్ని పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. పేదలందరికీ కార్పొరేటు వైద్యసేవలను ఉచితంగా అందజేయాలి. ఉన్నతస్థాయి వరకు ఉచిత విద్యను అందించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. ప్రతి కుటుంబానికి వ్యవసాయ భూమి, పక్కా ఇల్లు ఇవ్వాలి. కులవృత్తులకు చేయూతనివ్వాలి.
 - కోటగిరి వీరన్నగౌడ్, రంగశాయిపేట, వరంగల్ జిల్లా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement