ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఎన్నికల అక్రమాలకు చెక్
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ, రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇతర అక్రమాలను నియంత్రించడానికి ఎన్నికల సంఘం సరికొత్త సాంకేతికతను వినియోగించుకోనుంది. ఎక్కడ ఏ అక్రమం జరి గినా దానిని ఆడియో, వీడియో, ఫొటోలను వెంటనే ఈసీ వెబ్‌సైట్లోకి అప్‌లోడ్ చేసేందుకు తోడ్పడే ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీనిద్వారా అప్‌లోడ్ చేసిన వాటికి సంబంధించిన ప్రాంతం, తేదీ, సమయం వంటి వివరాలు వాటంతట అవే నమోదవుతాయి.
తద్వా రా తప్పుడు, మార్పు చేసిన వీడియోలు, ఫొటోలు వంటివి ఉండే అవకాశం కూడా ఉండదని, వీటిని వెబ్‌సైట్లోకి అప్‌లోడ్ చేసిన వెంటనే పరిశీలించి తగిన చర్యలు చేపట్టవచ్చని ఒక సీనియర్ ఎన్నికల అధికారి వెల్లడించారు. పౌరులెవరైనా తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని.. రాజకీయ నాయకుల ప్రసంగాల దగ్గరి నుంచి డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ వంటివాటి దృశ్యాలన్నీ ఈసీ వెబ్‌సైట్లోకి అప్‌లోడ్ చేయవచ్చు. అక్రమాలను బయటపెట్టిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.