స్ట్రాంగ్ భద్రత
Published Sun, Apr 13 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ :ప్రాదేశిక పోరులో ఓటరు తీర్పును దాదాపు నెల రోజుల పాటు కాపు కాసేందుకు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్యాలట్ బాక్సులు భద్రపరిచిన ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. 40 మంది సాయుధ పోలీసులు పహారా కాస్తున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు వరకు బ్యాలట్ బాక్సులను భద్రపరచనున్నారు.అమలాపురం, రామచంద్రపురం, రంపచోడవరం డివిజన్లలో రెండు విడతలో శుక్రవారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బ్యాలట్ బాక్సులను పోలీసు బందోబస్తు నడుమ ఆయా ప్రాంతాల నుంచి స్ట్రాంగ్ రూంలకు తరలించారు. అమలాపురం డివిజన్‌లోని బ్యాలట్ బాక్సులను అమలాపురం కిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల, పరంజ్యోతి పబ్లిక్ స్కూల్‌లోని స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచారు. రామచంద్రపురం డివిజన్‌లోని 8 మండలాలకు సంబంధించిన బ్యాలట్ బాక్సులను వీఎస్‌ఎం కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో, రంపచోడవరం డివిజన్‌లోని 7 మండలాల బ్యాలట్ బాక్సులను బొర్నగూడెంలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు.
అమలాపురం డివిజన్‌లోని అల్లవరం, రాజోలు, అమలాపురం, ఉప్పలగుప్తం, మామిడికుదురు, మలికిపురం, కాట్రేనికోన, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల బ్యాలట్ బాక్సులను మండలానికి ఓ గది చొప్పున కిమ్స్‌లోని స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. పరంజ్యోతి పబ్లిక్ స్కూల్‌లో పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల బ్యాలట్ బాక్సులను ఉంచారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ రెండు కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూంలకు ఆయా మండలాల ఆర్‌ఓలు, ఏఆర్‌ఓల సమక్షంలో అమలాపురం రూరల్ సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, పట్టణ సీఐ సీహెచ్ శ్రీనివాసబాబు సీలు వేశారు.
సాయుధ బలగాలతో 24గంటల భద్రత
అమలాపురంలోని కిమ్స్ కళాశాల, పరంజ్యోతి స్కూల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఆయా విద్యా సంస్థల సిబ్బందిని కూడా రావద్దని ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూంలకు రిజర్వ్ సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విడతల వారీగా షిఫ్ట్‌కు 20 మంది చొప్పున 24 గంటలూ భద్రత కల్పిస్తున్నారు. అమలాపురం డీఎస్పీ ఎం.వీరారెడ్డి, సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో రంపచోడవరంలోని బొర్నగూడెం స్ట్రాంగ్ రూంకు అదనంగా 15 మంది భద్రత సిబ్బందిని ఎన్నికల అధికారులు కేటాయించారు.
Advertisement