వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడి
నల్లచెరువు,న్యూస్‌లైన్: మండల పరిధిలోని గొర్లవాండ్లపల్లిలో ఆదివారం అర్ధరాత్రి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. గ్రామానికి చెందిన నరసింహులు, వెంకటరమణపై, టీడీపీ నాయకులు నాగభూషణ, వెంకటరమణ, రమణప్ప, శంకర, శివన్న, వెంకటేషులు దాడికి పాల్పడ్డారు. ఎస్‌ఐ మగ్బూల్‌బాషా తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో మారెమ్మ దేవాలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రూ.3 లక్షలు విరాలం ప్రకటించి, అడ్వాన్సుగా రూ.లక్ష ఇచ్చారు. గుడి నిర్మాణం రూఫ్ లెవల్‌కు చేరుకుంది.
అయితే ఎన్నికల్లో కందికుంట ఓడిపోవడంతో టీడీపీ నాయకులు ఆగ్రహించారు. దేవాలయ నిర్మాణానికి డబ్బు ఇచ్చినా ఓట్లు వేయలేదన్న ఆగ్రహంతో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. బాధితుల్ని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, నాయకుడు డాక్టర్ సిద్దారెడ్డిలు ఆస్పత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేకనే కందికుంట వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారని, ఇది మంచిది కాదని వారు హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వం ఇంకా అధికారం చేపట్టకనే కందికుంట వర్గీయులు ఇలా విధ్వంసాలకు పాల్పడుతుంటే.. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామాల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వారి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని, దాడులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు పోలీసులు కోరారు.
వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వేశారంటూ కొడవలితో దాడి
జౌకల(ఎన్‌పీకుంట), న్యూస్‌లైన్ : మండల పరిధిలోని జౌకల గ్రామంలో ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ఓటేశారంటూ ఆ పార్టీకి చెందిన బాబురెడ్డిపై, ఆదివారం రాత్రి టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచు హనుమంతురెడ్డి, ఆయన అనుచరులు కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. అంతకు ముందే నిన్ను చంపుతామంటూ ఫోన్‌లో బెదిరించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీకి చెందిన హనుమంతరెడ్డి, నరేంద్రరెడ్డి, రాణెమ్మ, రాజశేఖర్‌రెడ్డి, చిన్నపరెడ్డి, రమణమ్మ, జీవన్‌రెడ్డి, వేదాంతరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు సుమారు 30 మందికి పైగా బాబురెడ్డి ఇంటిపై దాడి చేశారు.
అతని ముఖంపై కారంపొడి చల్లి, కొడవలితో గాయపర్చారు. దీంతో బాబురెడ్డి స్పృహ తప్పి పడిపోయాడు. దాడి చేస్తున్నారన్న సమాచారం తెలిపి చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకుని మరింత నష్టం జరగకుండా కాపాడారు. క్షతగాత్రున్ని బంధువులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.