
ఇలా కలసిపోతున్నారు!
ఉద్ధృతంగా వీస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభంజనం.. టీడీపీ దుష్ర్పచారాన్ని నమ్మని జనం.. గ్రామస్థాయిలో ఎదురవుతున్న చేదు అనుభవాలు.. జిల్లాలో సైకిల్ గాలి తీసేస్తున్నాయి.
మరోవైపు..
పేరుకు జాతీయ పార్టీ. రాష్ట్ర విభజనతో గల్లీ పార్టీ కన్నా హీనంగా మారిన పరిస్థితి. పేరుకు అన్ని చోట్లా అభ్యర్థులు రంగంలో ఉన్నా ఒక్కరన్నా గెలిచే పరిస్థితి లేదన్నది కాంగ్రెస్‌కు మొదటే అవగతమైంది.
మరెలా..
ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్‌ఆర్‌సీపీని వేర్వేరుగా ఢీకొనలేమన్న నిర్ణయానికి వచ్చిన ఈ రెండు పార్టీలు శత్రువుకి శత్రువు మిత్రుడన్న సూత్రాన్ని అందిపుచ్చుకున్నాయి. ఉమ్మడి ప్రత్యర్థి అయిన వైఎస్‌ఆర్‌సీపీని ఢీకొనేందుకు కుమ్మక్కు రాజకీయానికి తెర తీశాయి.
ప్రధానంగా టీడీపీ ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థులనే బుట్టలో వేసుకునేందుకు మంత్రాంగం నెరుపుతోంది. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం’ అనే రీతిలో కాంగ్రెస్ అభ్యర్థులూ సరేనంటున్నారు. ఒక జాతీయ పార్టీ.. మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న మరో ప్రాంతీయ పార్టీ కలిసి కొత్త పార్టీ అయిన వైఎస్‌ఆర్‌సీపీని ఎదుర్కోలేక ఎలా కుమ్మక్కవుతున్నారో చూద్దాం రండి..
- సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
నరసన్నపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ విజయం నల్లేరుపై నడకేనని.. మెజార్టీ ఎంతన్నదే లెక్క తేలాల్సి ఉందన్న విషయాన్ని టీడీపీ, కాంగ్రెస్‌లు గుర్తించాయి. దాంతో ఇక లాభం లేదని ఆ రెండు పార్టీలు నియోజకవర్గస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఒక్కటవుతున్నాయి. ఇందులో భాగంగానే టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు నరసన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి డోల జగన్‌మోహన్‌రావు ఇటీవల మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. వారి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు డోల జగనే టీడీపీకి ఓటేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే పోలాకి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఆ దిశగా సంసిద్ధం చేశారు. ఒకటి రెండ్రోజుల్లో మిగిలిన మండలాలకూ ఈ సందేశాన్ని అందించనున్నారు.
పాతపట్నంలో ఎదురీదుతున్న మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు కూడా కమ్మక్కు కుట్రనే నమ్ముకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కలమట వెంకటరమణ ఘన విజయం దాదాపు ఖాయమని తేలడంలో టీడీపీలో గుబులు పట్టుకుంది. సామాజికవర్గ సమీకరణలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌కు చాలా అనుకూలంగా ఉండటంతో ఏం చేయాలేని స్థితిలో పడిపోయింది. దాంతో దింపుడు కళ్లెం ఆశతో కాంగ్రెస్ అభ్యర్థి పాలవలస కరుణాకర్‌తో మంతనాలు సాగిస్తోంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కూడా ఆయనకు మంచి ప్యాకేజీ ఆఫర్ చేసి లోపాయికారీ చర్చలు కొనసాగిస్తున్నారు. డీల్ కుదిరితే టీడీపీకి ఓటేయాలని కరుణాకరే కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పాలన్నది ఒప్పందం.
బొడ్డేపల్లి ప్రాపకం కోసం కూన పాట్లు
ఆమదాలవలస అంటేనే తమ్మినేని, బొడ్డేపల్లి కుటుంబాల రాజకీయ క్షేత్రం. కానీ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి ముందే కాడి వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. పోరాడితే పోలింగ్ వరకు గట్టిగా నిలబడాలి. అదంతా వ్యయప్రయాసలతో కూడుకున్నది.. పైగా గెలిచే అవకాశాలు లేనప్పుడు చేతి చమురు ఎందుకు వదల్చుకోవాలని ఆమె భావిస్తున్నారు. దీన్ని గుర్తించిన కూన రవి ఆమెతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కూనకు సహకరించేందుకు సత్యవతి సూత్రప్రాయంగా అంగీకరించారని తెలుస్తోంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ తుడుచుకుపెట్టుకుపోయినా కేవలం బొడ్డేపల్లి కుటుంబంపై ఉన్న అభిమానంతో తాము పార్టీలో కొనసాగుతుంటే సత్యవతి ఇలా కుమ్మక్కు కావడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
పాలకొండలో ఒక్కటైన ‘నిమ్మక’
- ఎంపీ ఓట్లు కిశోర్‌కు గురుదక్షిణ!?
గురుభక్తి కేంద్ర బిందువుగా పాలకొండలో కాంగ్రెస్ టీడీపీతో జట్టు కట్టింది. తాను గెలవనని నిర్ధారించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సుగ్రీవులు.. కనీసం తన రాజకీయ గురువు కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్‌కు మేలు చేయాలని భావించారు. అందుకే టీడీపీతో తెరచాటు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఓట్లను టీడీపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్‌కు వేయించేందుకు.. ప్రతిగా ఎంపీ ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్‌కు వేయాలన్నది ఒప్పందమని సమాచారం. ఈ ఒప్పందంతో పాలకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారాన్ని దాదాపుగా నిలిపివేసింది. తూతూ మంత్రంగా చేస్తున్న ప్రచారంలో కూడా ప్రధానంగా ఎంపీ ఓటు గురించే అభ్యర్థిస్తుండటం గమనార్హం. టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కూడా ఎంపీ ఓట్ల విషయంలో కిశోర్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అంతేగానీ టీడీపీ ఎంపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణికి ఓటేయాలని ప్రస్తావించడమే లేదు.
టీడీపీ వైపు తిరిగిన ‘వంకా’
పలాస నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వంకా నాగేశ్వరరావు ప్రచారం ఇష్టం లేని కాపురంలా సాగుతోంది. దీన్ని గుర్తించిన టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రామ్మోహన్, శివాజీ ఆయనతో జరిపిన లోపాయికారీ సంప్రదింపులు ఫలించినట్లు తెలుస్తోంది. దాంతో టీడీపీకి సహకరించాలని నాగేశ్వరరావు తన వర్గీయులకు చెబుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తరఫున ప్రచారానికి కేంద్రమంత్రి చిరంజీవి నియోజకవర్గానికి వస్తే తన సామాజికవర్గం అత్యధికంగా ఉన్న వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఆయనతో ప్రచారం చేయించకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో వంకా నాగేశ్వరరావు టీడీపీ బుట్టలో పడ్డారని కాంగ్రెస్ కార్యకర్తలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
బెందాళంతో జట్టుకట్టిన లల్లూ
ఇచ్ఛాపురం కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ కుమార్ అగర్వాల్(లల్లూ) టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్‌తో జత కట్టారు. ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహారం సాగిస్తున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ గాలానికి ఆయన చిక్కినట్లు సమాచారం. తాను ఎలాగూ గెలిచే అవకాశం లేనందున తనకు అంతో ఇంతో పట్టున్న కంచిలి, కవిటి మండలాల్లో టీడీపీతో అంటకాగుతున్నారు. ఆ రెండు మండలాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు టీడీపీ శిబిరంలో కనిపిస్తున్నారు.
మసకబారిన ‘కిరణం’
ఎచ్చెర్లలో కాంగ్రెస్ ఆశా కిరణం పోలింగ్‌కు ముందే మసకబారిపోయిది. ఎన్నికల సమరం తన వల్ల కాదని కాంగ్రెస్ అభ్యర్థి రవి కిరణ్ గ్రహించారు. దాంతో ఆయన కుటుంబంతో ఉన్న పాత స్నేహాన్ని తిరగదోడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కళా వెంకట్రావు రంగంలోకి దిగారు. ఈ ప్రయత్నం ఫలించినట్లే కనిపిస్తోంది. అందుకే రవికిరణ్ దాదాపుగా అస్త్ర సన్యాసం చేసి ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు.